ముదిరాజ్‌ల‌కు టికెట్ నిరాక‌ర‌ణ వెనుక వ్యూహం!

రాజ‌కీయాల్లో సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌కు అన్ని పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయి. ఇందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ మిన‌హాయింపేమీ కాదు. బీఆర్ఎస్ అభ్య‌ర్థుల జాబితాను ప‌రిశీలిస్తే… ముదిరాజ్‌ల‌కు క‌నీసం ఒక్క సీటు కూడా కేసీఆర్ కేటాయించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశమైంది.…

రాజ‌కీయాల్లో సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌కు అన్ని పార్టీలు ప్రాధాన్యం ఇస్తాయి. ఇందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ మిన‌హాయింపేమీ కాదు. బీఆర్ఎస్ అభ్య‌ర్థుల జాబితాను ప‌రిశీలిస్తే… ముదిరాజ్‌ల‌కు క‌నీసం ఒక్క సీటు కూడా కేసీఆర్ కేటాయించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశమైంది. బీఆర్ఎస్‌లోని ముదిరాజ్‌లను కూడా కేసీఆర్ నిర్ణ‌యం కొంత అసంతృప్తికి గురి చేసింది. బీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కుడు నీలం మ‌ధు ముదిరాజ్ మీడియాతో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ ఓట‌ర్లు 60 ల‌క్ష‌ల మంది ఉన్న‌ట్టు ప‌లు సంద‌ర్భాల్లో కేసీఆర్ చెప్పిన విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు. ఇంత మంది ఓట‌ర్లున్న ముదిరాజ్‌ల‌కు క‌నీసం ఒక్క అసెంబ్లీ సీటు కూడా కేటాయించ‌క‌పోవ‌డం ఆవేద‌న క‌లిగిస్తోంద‌ని ఆయ‌న అన్నారు. బీఆర్ఎస్‌లో ముదిరాజ్‌ల‌కు చోటు ఇవ్వ‌క‌పోవ‌డం వెనుక కేసీఆర్ ప‌క్కా వ్యూహం వుంది.

బీజేపీ నాయ‌కుడు ఈట‌ల రాజేంద‌ర్‌ను దృష్టిలో పెట్టుకునే ముదిరాజ్‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌కూడ‌ద‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకున్న‌ట్టు చెబుతున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ ముదిరాజ్ సామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌. బీజేపీలో రాజేంద‌ర్ క్రియాశీల‌క నేత‌గా వుండ‌డంతో ఆయ‌న వెంట సామాజిక వ‌ర్గం కూడా వెళుతుంద‌ని కేసీఆర్‌కు ప‌లు స‌ర్వేలు నివేదిక‌లు స‌మ‌ర్పించిన‌ట్టు స‌మాచారం. ముదిరాజ్‌ల‌కు బ‌దులు ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం రాజ‌కీయ ప్ర‌యోజ‌నం వుంటుంద‌ని కేసీఆర్ అంచ‌నా.

అయితే ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీలో ఉండ‌డం వ‌ల్ల ఆయ‌న సామాజిక వ‌ర్గం అంతా గంప‌గుత్త‌గా ఆ పార్టీకి ఓట్లు వేస్తుంద‌ని అనుకోవ‌డం అజ్ఞాన‌మే అని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ విష‌యం కేసీఆర్ లాంటి రాజ‌కీయ అనుభ‌వ‌జ్ఞుడికి తెలియ‌ద‌ని అనుకోలేమ‌ని బీఆర్ఎస్ నేత‌లు అంటున్నారు. క‌నీసం ఒక్క సీటైనా ముదిరాజ్ సామాజిక వ‌ర్గానికి కేటాయించి వుంటే బాగుండేద‌ని అంటున్నారు.