ఆ మధ్య డబ్ల్యూహెచ్వో సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ఒక మాట చెప్పారు. ఇండియాలో కోవిడ్ ఎండెమిక్ స్టేజ్ లోకి ప్రవేశించిందన్నారు. మలేరియా తదితర విషజ్వరాల వలె కోవిడ్ కూడా ఈ భౌగోళిక ప్రాంతంలో వ్యాపిస్తుందన్నారు. తీవ్ర ప్రభావం తగ్గుతుందని, మరిన్ని వేవ్ లు వస్తాయని చెప్పలేమని, ఒకవేళ కేసుల సంఖ్య పెరిగినా… సెకెండ్ వేవ్ తరహాలో తీవ్ర ప్రభావం ఉండదని ఆమె తమ అంచనాలను తెలిపారు. ఇప్పుడు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చీఫ్ డాక్టర్ సింగ్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని చెబుతున్నారు.
రానున్న రోజుల్లో భారతదేశంలో కరోనాను హ్యాండిల్ చేయడం సులభతరం అవుతుందని ఆయన తమ అంచనాల గురించి తెలిపారు. ఇంకో ఆరు నెలల్లోనే కరోనా ఒక ఫ్లూ తరహాలో మారుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సాధారణ ఫ్లూ జ్వరాలకు ఆసుపత్రుల్లో వైద్యం అందినట్టుగానే కరోనా కు కూడా వైద్యం అందుతుందన్నారు. సెకెండ్ వేవ్ సమయంలో తలెత్తిన తీవ్రమైన పరిస్థితుల్లాంటివి ఉండకపోవచ్చని ఆయన అన్నారు.
ఇప్పుడు కూడా ఇండియాలో వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. వాటితో అనేక మంది అస్వస్థతకు గురవుతున్నారు. అయితే డాక్టర్ల వద్దకు వెళ్లడం, వారిచ్చే ట్యాబ్లెట్లను వాడుతూ రెండు మూడు రోజుల్లో రికవర్ అవుతున్నారు చాలా మంది. త్వరలో కరోనా ప్రభావం కూడా ఈ స్థితికి వస్తుందన్నట్టుగా ఈ హెల్డ్ బాడీ చీఫ్ చెబుతున్నారు.
వ్యాక్సినేషన్ విస్తృతంగా జరుగుతుండటం, ఇదే సమయంలో చాలా మంది కరోనాకు గురై కోలుకోవడం.. వంటి పరిణామాలన్నీ కరోనా ప్రభావం తగ్గడానికి కారణాలవుతాయని సింగ్ చెబుతున్నారు. ఇప్పటి వరకూ 75 కోట్ల మందికి కనీసం ఒక డోసు వ్యాక్సినేషన్ జరిగిందని, అలాగే చాలా మంది కరోనాకు గురై కోలుకున్నారని.. దీని వల్ల హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమని అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింతగా జరగడం వల్ల కూడా కరోనా ప్రభావం తగ్గుతుందన్నారు.
ఇక థర్డ్ వేవ్ ఉండవచ్చా? తీవ్రంగా ఉంటుందా? అనే అంశాల గురించి ఆయన స్పందిస్తూ… ప్రజలు జాగ్రత్త చర్యలు అయితే తీసుకోవాలన్నారు. ఫెస్టివల్ సీజన్స్ వల్ల కేసుల సంఖ్య పెరగవచ్చనే ఆందోళన వ్యక్తం చేశారు. మరో వేవ్ రావాలంటే.. కేవలం వైరస్ తన రూపు మార్చుకుంటే చాలదని సింగ్ చెబుతున్నారు. న్యూ వేరియెంట్స్ కోవిడ్ వైరస్ వల్ల మూడో వేవ్ రావొచ్చనే అంచనాలను ఆయన కొట్టిపారేశారు. కేవలం రూపు మారినంత మాత్రాన వేవ్ వస్తుందనడానికి లేదన్నారు. మనుషుల్లోని యాంటీ బాడీలు కూడా ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్రజల్లో సహజసిద్ధమైన లేదా వ్యాక్సిన్ వల్ల యాంటీబాడీలు ఏర్పడితే, కొత్త వేరియెంట్లు కూడా పెద్దగా ప్రభావం చూపలేవని సింగ్ అంటున్నారు.
ఇక బ్రేక్ థ్రూ ఇన్ఫెక్షన్లు కూడా ఉంటాయని సింగ్ అంటున్నారు. ఒక డోసు, రెండు డోసు వ్యాక్సినేషన్ తర్వాత కూడా కొంతమంది కరోనాకు గురవుతున్నారు. వ్యాక్సిన్ల వల్ల వచ్చే యాంటీబాడీల ప్రభావం 60 నుంచి 70 రోజుల్లో తగ్గిపోవడం వల్ల కూడా బ్రేక్ థ్రూ ఇన్ఫెక్షన్లు సంభవిస్తుండవచ్చని సింగ్ అంటున్నారు. రానున్న రోజుల్లో కరోనా తీవ్రత తగ్గడం ఖాయమే అయినా, ప్రజలు మాత్రం జాగ్రత్త చర్యలను కొనసాగించాలని ఈ వైద్య నిపుణుడు సూచిస్తున్నారు.