వేసవిలో జరగాల్సి ఉండి, కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహణకు బీసీసీఐ కసరత్తు మొదలుపెట్టినట్టుగా ఉంది. ఐపీఎల్ ను ఎటు తిరిగీ నిర్వహిస్తామని బీసీసీఐ ఘంటాపథంగా చెబుతూ ఉంది. ఈ క్రమంలో ఇండియాలో అయితే నిర్వహణ సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండటమే దీనికి కారణం. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు కలిగిన దేశాల్లో మూడో జాబితాలోకి చేరింది ఇండియా. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియాలో ఐపీఎల్ నిర్వహణ సమస్యే లేదని స్పష్టం అవుతోంది.
ఈ క్రమంలో విదేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను నిర్వహించడానికి బీసీసీఐ రెడీ అవుతూ ఉంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ప్రకటించారు. ఈ ఏడాది విదేశంలో ఐపీఎల్ జరుగుతుందని ఆయన తెలిపారు. దీంతో మరోసారి ఐపీఎల్ దేశం దాటుతుందని స్పష్టం అవుతోంది.
ప్రపంచంలోని కొన్ని దేశాలు ఇప్పుడు కూడా సేఫ్టీగా ఉన్నాయి. క్రికెట్ కు బాగా ప్రాచూర్యం ఉన్న దేశాలు కూడా కొన్ని కరోనా భయాల్లేకుండా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఆ దేశాల్లో నిర్వహణకు అవకాశం ఉన్నట్టే.
ఐపీఎల్ నిర్వహణకు తాము సిద్ధమని ఇప్పటికే పలు దేశాల క్రికెట్ బోర్డులు కూడా ప్రకటించాయి. శ్రీలంక, యూఏఈ, న్యూజిలాండ్ లు ఈ ప్రకటన చేశాయి. ఈ నేపథ్యంలో.. ఈ దేశాల్లో ఎక్కడో ఒక చోట ఐపీఎల్ జరిగే అవకాశం ఉందని స్పష్టం అవుతోంది. గంగూలీ చేసిన ప్రకటన అందుకు ఊతం ఇస్తూ ఉంది. తమ దేశంలో కరోనా ప్రభావం చాలా తక్కువగా ఉందని ఇప్పటి న్యూజిలాండ్ ప్రకటించింది. కరోనా ఫ్రీ అంటూ ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో ముందుస్తు జాగ్రత్తలు తీసుకుని అలాంటి చోట ఐపీఎల్ నిర్వహిస్తే ఇళ్లకు పరిమితం అయిన క్రికెట్ ప్రేమికులకు ఉత్సాహాన్ని ఇచ్చే అంశమే అవుతుంది.