150 కోట్ల రూపాయల విలువైన ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టైన తెలుగుదేశం ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కోర్టుల్లో వరసగా పిటిషన్ లు దాఖలు చేస్తున్నారు. తనకు శస్త్ర చికిత్స జరిగిందని తనను జైల్లో ఉంచరాదని, తనను ఏదైనా కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాలని కోరుతూ ఉన్నారు అచ్చెన్నాయుడు. ఈ మేరకు ఇప్పటికే కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ కొనసాగుతూ ఉంది.
అచ్చెన్నాయుడును అరెస్టు చేసిన వెంటనే గుంటూరు జనరల్ హాస్పిటల్ కు తరలించారు. తనకు శస్త్ర చికిత్స జరిగిన నేపథ్యంలో వైద్య సేవలను కోరారు ఆయన. ఆ నేపథ్యంలో కోర్టు ఆయనను జీజీహెచ్ కు తరలించమని ఆదేశాలు ఇచ్చింది. ఆయనకు చికిత్స చేసి, పూర్తిగా కోలుకున్నారని ధ్రువీకరించి వైద్యులు ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఆయన ఇక ఆసుపత్రిలో అవసరం లేదని వారు తేల్చి చెప్పారు.
దీంతో అచ్చెన్నాయుడిని పోలీసులు విజయవాడ సబ్ జైలుకు తరలించారు. ఆవెంటనే అచ్చెన్నాయుడు మరో పిటిషన్ వేశారు. తనకు కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స కావాలని ఆయన కోరుతూ కోర్టుకు ఎక్కారు. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యా ఇప్పుడు లేదని, ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలనేది ఏసీబీ తరఫు వాదనగా తెలుస్తోంది. కేవలం జైల్లో ఉండటానికి ఇష్టపడక ఆయన సాకులు చెబుతూ ఉన్నారని, తల తిరుగుతోందంటూ.. ఏదో ఒక మిషతో ఆసుపత్రికి చేరేందుకు ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారని ఈసీబీ తరఫున కోర్టులో వాదన వినిపించారు.
ఈ నేపథ్యంలో ఈ విషయంలో తీర్పును బుధవారానికి వాయిదా వేశారు న్యాయమూర్తి. ఆ సంగతలా ఉంటే.. అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ ను ఇప్పటికే ఏసీబీ కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఆయన హై కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. మరి అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్ పై హై కోర్టులో ఏం జరుగుతుందనేది ఆసక్తిదాయకంగా మారింది.