ఆంధ్రుల దశాబ్దాల కలకు సంబంధించి ఒక్కో అడుగు వడివడిగా పడుతున్న సందర్భం ఇది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చరిత్రలో నిలిపే తరుణం సమీపిస్తున్నట్టుగా ఉంది. పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతూ ఉన్నాయనే వార్తలు ఆంధ్రప్రదేశ్ కు కొత్త ఆశలను రేకెత్తిస్తూ ఉన్నాయి. కరోనాతో ప్రపంచమంతా మందగమనంలో పడుతున్న నేపథ్యంలో పోలవరం పనులు మాత్రం వేగంగా సాగుతూ ఉండటం గమనార్హం. కరోనా కారణంగా వాయిదాలు లేకుండా పోలవరం ప్రాజెక్టు పెట్టుకున్న గడువులోగా పూర్తయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉండటం గమనార్హం.
ఇన్నాళ్లూ పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పుకోవడానికి మొండిగోడల ఫొటోలే ప్రదర్శించుకోవాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు పరిస్థితి మారిన వైనం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన స్పిల్ వే నిర్మాణం ఈ రకంగా ఊపందుకుంటూ ఉంది. ప్రపంచంలో అతి పెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్టుగా నిలవబోయే ఈ ప్రాజెక్టు స్పిల్ వేకు సంబంధించి గడ్డర్ల ఏర్పాటు ఇప్పుడు సాగుతూ ఉందని సమాచారం. గేట్లను ఏర్పాటు చేయడానికి సంబంధించి ఇప్పుడు కీలక పనులు సాగుతున్నాయి. అధునాతన హైడ్రాలిక్ వ్యవస్థతో పోలవరం గేట్లు నిర్మితం కానున్నాయని తెలుస్తోంది.
ఏపీకి సంబంధించిన ప్రగతి అంటే… గత ఐదేళ్లలో అన్నీ గ్రాఫిక్స్ లో మాత్రమే కనిపించేవి. అసలు కన్నా కొసరు విషయాలే అప్పుడు ఎక్కువగా ఉండేవి. మొండి గోడలను చూపించి అదే పోలవరం అంటూ.. అనంతపురం నుంచి కూడా జనాలను బస్సుల్లో తరలించి చూపించి పోలవరం ప్రాజెక్టు సందర్శనకు అంటూ వేరే ఖర్చులు రాసి అలా కూడా దోపిడీ చేసింది గత ప్రభుత్వం. రాసుకో.. రాసుకో.. అంటూ హడావుడి చేసి, చివరకు రాసుకోవడమే తప్ప, చూసుకోవడానికి ఏమీ లేకుండానే గత ప్రభుత్వం దిగిపోయింది.
మాటల ప్రభుత్వ హయాంలో పోలవరం పరిస్థితి అది కాగా, పెట్టుకున్న గడువులోగా జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేసేలా ఉంది. మందగమన పరిస్థితుల్లో కూడా పనులు వేగంగా సాగుతున్న నేపథ్యంలో… అనుకున్నది సాధించి చూపి జగన్ ప్రభుత్వం ఆంధ్రుల దశాబ్దాల కలను నెరవేర్చి, భేష్ అనిపించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.