పొడుగయ్యే వాస్తు కుదిరిందా? 

సచివాలయం కూలగొట్టుకోవచ్చు అని హైకోర్టు తీర్పు ఇవ్వగానే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మహదానందపడిపోయి ఉంటారు. ఆయన కోరుకున్నది అదేకదా. మొన్నీమధ్యనే సచివాలయంలో ఉన్న పాత కార్లు, సామగ్రి అంతా తరలించేశారు. ఈ రోజు నుంచి…

సచివాలయం కూలగొట్టుకోవచ్చు అని హైకోర్టు తీర్పు ఇవ్వగానే తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ మహదానందపడిపోయి ఉంటారు. ఆయన కోరుకున్నది అదేకదా. మొన్నీమధ్యనే సచివాలయంలో ఉన్న పాత కార్లు, సామగ్రి అంతా తరలించేశారు. ఈ రోజు నుంచి భవనాలు కూలగొట్టుడు షురూ చేశారు.

జేసీబీలు రంగంలోకి దిగాయి. పాత సచివాలయం వైపు వెళ్లే రహదారులను మూసివేశారు. కూల్చివేత పనులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆల్రెడీ కొత్త సచివాలయం డిజైన్ కూడా తయారైందని  కబురొచ్చింది. ఒక డిజైనయితే బయటకు వచ్చింది. అదే ఫైనల్  అంటున్నారు.

కేసీఆర్ డిజైన్ చేయించారంటే అది మామూలుగా  ఉండదు కదా. వంద శాతం వాస్తు ప్రకారమే ఉంటుంది. వాస్తు ప్రకారం ఉందని ఆయన నిర్ధారించుకుంటే తప్ప ఓకె చేయరు. సచివాలయం వాస్తు బాగా లేదనే కదా ఆయన దాని ముఖం కూడా చూడలేదు. అసలు దాంట్లోకి ఎంటర్ కూడా అవలేదు కదా.

సచివాలయం కూలగొట్టొద్దని ప్రతిపక్ష నాయకులే కాదు, కొందరు నాన్ పొలిటీషియన్స్ చెప్పినా వినలేదు. ఏ విషయంలోనైనా సరే కేసీఆర్ మొండి మనిషి. ఒక్క కేసీఆరే కాదు  పాలకుల్లో ఎక్కువమంది మొండిగానే ఉంటారు. ప్రతిపక్షాల అభ్యంతరాలను లెక్కలోకి తీసుకుంటే వారికి లొంగి పోయినట్లుగా ఉంటుంది. సచివాలయం కూల్చొద్దని ప్రతిపక్షాలు చెప్పాయి.

సరేనయ్య… కూల్చనులే అని కేసీఆర్ చెప్పారనుకోండి దాన్ని ప్రతిపక్షాలు క్యాష్ చేసుకుంటాయి. కేసీఆర్ పై తాము విజయం సాధించామని ప్రచారం చేసుకుంటాయి. ఇది రాజకీయంగా ఆయనకు నష్టం. పార్టీ నాయకులకు ఆయన హీరోలా కాకుండా జీరోలా కనబడతాడు. అందుకే ఏ ముఖ్యమంత్రీ ప్రతిపక్షాలను లెక్క చేయడు. ప్రతీ సీఎం ప్రతిపక్షాలకు  నిర్మాణాత్మక సలహాలు ఇస్తే స్వీకరిస్తాం అని చెబుతాడు.

కానీ ఆ సలహాలు పాటించిన సీఎం ఇప్పటివరకు కనబడలేదు. మితిమీరిన ప్రభుత్వ చర్యలను ఆపాలంటే ప్రతిపక్షాలకు కోర్టుకు వెళ్లడం తప్ప మరోమార్గం లేదు. వీటిల్లో కొన్ని కేసుల్లో తీర్పులు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే, మరి కొన్ని వ్యతిరేకంగా వస్తాయి. కేసీఆర్ ఏదైనా అనుకుంటే చివరిదాకా మొండిగానే ఉంటారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ఆయన వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శల పాలైనా పట్టిన పట్టు వదల్లేదు.

కార్మికులు కోర్టుకు వెళ్లినా కేసీఆర్ అదే పట్టుదల కొనసాగించారు. చివరకు హైకోర్టు చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వచ్చింది. సచివాలయం విషయంలోనూ అదే జరిగింది. ఆర్టీసీ సమ్మె విషయంలోనూ, సచివాలయం కూల్చివేత విషయంలోనూ కేసీఆర్ ప్రభుత్వం కోర్టుకు రకరకాల అవాస్తవాలు చెప్పింది. అయినప్పటికీ చివరగా అనుకూల తీర్పులు వచ్చాయి.

వాస్తు బాగాలేదని చెప్పి సచివాలయం కూలగొట్టాలని, కొత్తది కట్టాలని అనుకున్నారు. ఈ విషయం ఆయన బహిరంగంగానే చెప్పారు. ఈ సచివాలయంలో ఎవరూ పొడుగు (అభివృద్ధి చెందలేదని, బాగుపడలేదని) కాలేదని అన్నారు. కానీ కోర్టులో మాత్రం సచివాలయం ఇప్పటి అవసరాలకు అనుగుణంగా లేదని, ఇరుకుగా ఉందని, అగ్నిప్రమాదం జరిగితే ఫైరింజన్ తిరిగే చోటు కూడా లేదని, పార్కింగ్ సౌకర్యం లేదని, భవనాలు పాతబడిపోయి ఎప్పుడు కూలుతాయో తెలియకుండా ఉందని … ఇలా అనేక కారణాలు ప్రభుత్వం చెప్పింది.

ప్రభుత్వం నిపుణులతో ఒక కమిటీ వేసి సచివాలయం బాగాలేదని, కూలగొట్టడమే మంచిదని నివేదిక తెప్పించుకుంది. ఎన్ని చెప్పినా హైకోర్టు సంతృపి చెందలేదు. చివరకు ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకునే హక్కు కోర్టుకు లేదని, గతంలో ఒక కేసులో సుప్రీం కోర్టు ఇదే విషయం చెప్పిందని ప్రభుత్వం వాదించింది. దీంతో ఏకీభవించిన హైకోర్టు సచివాలయం కూల్చివేతకు అనుమతి ఇచ్చింది.

ఈ సచివాలయంలో (వంద శాతం వాస్తు ఉంటుంది కదా) కేసీఆర్ పొడుగవుతారో, ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ పొడుగవుతారో చూడాలి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారని, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారం జరుగుతోంది కదా. కేసీఆర్ అధికారంలోకి రాగానే అవి కూలగొడతా, ఇవి కూలగొడతా అంటూ హడావుడి చేశారు. అసెంబ్లీ కూడా మరోచోట కడతానన్నారు.

రవీంద్రభారతి కూలగొట్టి అత్యాధునికంగా కడతానన్నారు. ఇందుకోసం డిజైన్ కూడా తయారుచేయించారు. అప్పుడూ వ్యతిరేకత వచ్చింది. ప్రజలూ వ్యతిరేకించారు. ఎందుకోగానీ ఆ ప్రయత్నం మానుకున్నారు. ఎన్టీఆర్ పాలనలో ఆయన ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేసిన తెలుగు ప్రముఖుల విగ్రహాలు కూలగొడతానన్నారు. వాటిల్లో ఆంధ్రా వాళ్ళ విగ్రహాలను జాగ్రత్తగా ప్యాక్ చేసి అక్కడికి పంపుతామన్నారు. ఆ ప్రయత్నమూ మానుకున్నారు.

ఇక కొత్త సచివాలయ నిర్మాణానికి అయిదారువందల కోట్లు ఖర్చవుతాయని ఇదివరకెప్పుడో అంచనా వేశారు. ఇప్పుడు ఆ అంచనాలు పెరుగుతాయేమో చెప్పలేం. ఏది ఏమైనా సచివాలయం విషయంలో కేసీఆర్ పంతం నెగ్గించుకున్నారు.

తప్పు చెయ్యకపోతే ఎందుకు పారిపోయాడు?

అమరావతిపై కుండబద్దలు కొట్టిన జివిఎల్