ఎయిర్ ఇండియా అమ్మకం ప్రక్రియ వేగిరం అయ్యింది. ఎయిర్ ఇండియాను కొనే ఆసక్తితో ఉన్న వాళ్లు ఫైనాన్షియల్ బిడ్స్ ను కూడా దాఖలు చేస్తున్నారట. ఈ విషయంలో టాటాస్ తో పాటు స్పైస్ జెట్ యాజమాన్యం ఇప్పటికే బిడ్ లను దాఖలు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో దాదాపు 70 యేళ్ల కిందట నెహ్రూ ప్రభుత్వం జాతీయం చేసిన సంస్థను మోడీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయబోతోంది.
మాటామాటికీ నెహ్రూను నిందించడం బీజేపీకి అలవాటు. మోడీ భక్తగణానికి అయితే అదో సరదా. అయితే విధి వైచిత్రి ఏమిటంటే.. నెహ్రూ హయాంలో జాతీయం అయిన వాటిని టోకున అమ్మేసుకుంటున్నారు నరేంద్రమోడీ. నెహ్రూ ఏంచేశాడు? నెహ్రూ ఏం చేశాడు? అంటూ పదే పదే ప్రశ్నిస్తూ ఉంటారు. మరి నెహ్రూ ఏం చేశాడంటే.. ఇప్పుడు మోడీ అమ్మడానికి ఆస్తులను ఇచ్చాడు!
1933లో జేఆర్డీ టాటా ఎయిర్ ఇండియాను స్థాపించారు. విజయవంతంగా నడిపించారు. స్వతంత్రానంతరం నెహ్రూ ప్రభుత్వం ఎయిర్ ఇండియాను జాతీయం చేసింది. ఆ పరిణామం మీదనే జేఆర్డీ అసహనం వ్యక్తం చేశాడంటారు. అయితే ఆ తర్వాత చాలా కాలం జేఆర్డీకి నెహ్రూ ప్రభుత్వం విలువను ఇచ్చింది.
ఎయిర్ ఇండియా విషయంలో ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటూ.. జాతికి ఒక ఆస్తిని ఏర్పాటు చేసింది. జనతా ప్రభుత్వం వచ్చే వరకూ కూడా టాటాలకు ఎయిర్ ఇండియాతో సాన్నిహిత్యం కొనసాగింది. జాతీయపరమైన ఆస్తి అయినప్పటికీ.. దాని ఉన్నతికి వారు కృషి చేశారు.
అయితే జనతా ప్రభుత్వం వచ్చాకా.. టాటాలను అక్కడ నుంచి తరిమేశారు. అంతిమంగా ఇప్పుడు ఎయిర్ ఇండియాను అమ్మేస్తున్నారు. తమ సామర్థ్యం గురించి అమోఘమైన రీతిలో చెప్పుకునే మోడీ ప్రభుత్వం ఆ సత్తా అంతా జాతీయ ఆస్తులను అమ్మడంలో అని నిరూపించుకుంటూ ఉంది. నెహ్రూను అనునిత్యం నిందిస్తూ.. ఆయన హయాంలో జాతీయం అయిన వాటి అడ్రస్ ను గల్లంతు చేసే పనిలో ఉన్నట్టున్నారు. మరి నెహ్రూపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఇంతకన్నా మార్గం లేదు కాబోలు!