తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గత కొన్నాళ్లుగా పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. దళితులను దూషిస్తూ ఆయన మాట్లాడిన మాటలపై నమోదైన కేసులో అరెస్టు కోసం పోలీసులు ప్రయత్నించగా చింతమనేని వారికి దొరకలేదు. పోలీసులు తనను అరెస్టు చేయడానికి వస్తున్నారనే సమాచారం తెలుసుకుని చింతమనేని పరార్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. పోలీసులే ఆయనకు ముందస్తుగా లీక్ ఇచ్చారని, పారిపొమ్మని ఆయనకు సన్నిహితులు అయిన పోలీసులు సంకేతాలు ఇచ్చారని.. దీంతో ఆయన పరార్ అయినట్టుగా తెలుస్తోంది.
ఈ విషయంలో ఆయనకు లీకులు ఇచ్చారనే పోలీసులపై శాఖాపరమైన చర్యలకు కూడా రంగం సిద్ధం అయినట్టుగా తెలుస్తోంది. ఆ సంగతలా ఉంటే.. చింతమనేని పై పెండింగ్ కేసుల సంఖ్య నలభై తొమ్మిదిగా తేలింది. ఆయనపై ఇప్పటికే రౌడీషీట్ కూడా తెరిచారు పోలీసులు. తన తీరుతో చింతమనేని ఎలా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చింతమనేనికి హద్దూఅదుపులేకుండా పోయింది.
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చిత్తు కావడానికి చింతమనేని వంటి వారి తీరు కూడా ఒక కారణమే. అయితే అలాంటి వారిని కంట్రోల్ చేయాలని చంద్రబాబు నాయుడు ఏనాడూ ప్రయత్నించినట్టుగా కనపడరు. అందుకే ఆయనా పర్యావసనాలను ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడేమో అడ్డగోలుగా వ్యవహరించడం, అధికారం చేజారాకా.. ఇలా పరారీ కావడం.. ఇదే తెలుగుదేశం పార్టీ నేతల రాజకీయం అనే అభిప్రాయాలు ప్రజల్లో ఏర్పడుతూ ఉన్నాయి. తెలుగుదేశం రౌడీ షీటర్ లు ఇలా పారిపోతుంటే చంద్రబాబు మాత్రం సానుభూతి ప్రయత్నాలు చేస్తూ ఉండటం గమనార్హం.