సినిమాలకు టికెట్ తెంపని బూస్టప్ లు

అంతన్నాడు..ఇంతన్నాడే గంగరాజు అన్నట్లు వుంది తెలుగు సినిమాల పరిస్థితి. విడుదలకు ముందు సినిమాలకు బూస్టప్ తీసుకురావడం కోసం, ముఖ్యంగా హీరోల మార్కెట్ స్టడీగానే వుంది, పడిపోలేదు అని చాటింపు వేయడం కోసం నాన్ థియేటర్…

అంతన్నాడు..ఇంతన్నాడే గంగరాజు అన్నట్లు వుంది తెలుగు సినిమాల పరిస్థితి. విడుదలకు ముందు సినిమాలకు బూస్టప్ తీసుకురావడం కోసం, ముఖ్యంగా హీరోల మార్కెట్ స్టడీగానే వుంది, పడిపోలేదు అని చాటింపు వేయడం కోసం నాన్ థియేటర్ ఇంత వచ్చింది..అంత వచ్చింది అని ఫీలర్లు వదలుతున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే కప్ టు లిప్ అని చాలా సంగతులు వున్నాయి. హిందీ డబ్బింగ్ అయినా, సినిమా డిజిటల్ అయినా, శాటిలైట్ లు అయినా మార్కెట్ కావడం ఇవ్వాళ రేపు అంత ఈజీ కావడం లేదు.

ముఖ్యంగా శాటిలైట్ మార్కెట్ సగం వరకు కుదేలయింది. ఓటిటి కారణంగా శాటిలైట్ రేట్లు భారీగా తగ్గాయి. అందరికన్నా ముందుగా పరుగున వచ్చేవి హిందీ డబ్బింగ్ రైట్స్ కొనేవాళ్లు మాత్రమే. ముందుగా అడ్వాన్స్ కొట్టి లాక్ చేస్తున్నది వాళ్లు మాత్రమే. కానీ పాన్ ఇండియా సినిమా అనుకున్నపుడు హిందీ డబ్బింగ్ అగ్రిమెంట్ లు చేసుకోవడానికి జంకుతున్నారు. పుష్ప ఎంత కిందా మీదా అయ్యారో అందరికీ తెలిసిందే. అప్పటి నుంచీ, తొందరపడి హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్మడానికి తొందరపడడం లేదు. అలా కాకుండా చేసుకోవాలనుకున్నా, డైరెక్ట్ రిలీజ్ క్లాజ్ కూడా అగ్రిమెంట్ లో పెడుతున్నారు.

డిజిటల్ రైట్స్ భారీ సినిమాలకు, బజ్ వున్న సినిమాలకు తొందరగా వస్తున్నాయి కానీ మిగిలిన వాటికి కాదు. కానీ నిర్మాణంలో వున్న సినిమాలకు బజ్ తీసుకురావడానికి, హీరోల మార్కెట్ పెంచి, జోష్ తీసుకురావడానికి మార్కెట్ లోకి ఫీలర్లు వదలుతున్నారు. పైగా ఓవర్ సీస్, థియేటర్, నాన్ థియేటర్ ఫిగర్లు బయటకు వస్తున్నవి అన్నీ ఇన్ ఫ్లేటెడ్ ఫిగర్లే తప్ప అసలు అంకెలు కాదు. ఇలా పెంచి వార్తలు ప్రచారం చేయడానికి చాలా కారణాలు వున్నాయి.

ఓవర్ సీస్ బయ్యర్ కిందకు అమ్ముకోవాలంటే కాస్త ఎక్కువ రేటు కు కొన్నట్లు చెప్పాలి. కాపీ కొన్నవాళ్లు కిందకు అమ్ముకోవాలంటే ఎక్కువ రేటుకు కొన్నట్లు చెప్పుకోవాలి. థియేటర్ రేట్లు ఎక్కువ రావాల్సి వుందీ అంటే ముందుగా నాన్ థియేటర్ రేట్లు బద్దలైపోయాయి అని ప్రచారం సాగించాలి. అయితే ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాలకు ఇవన్నీ తెలియనివి కాదు. అసలు రేట్లు తెలియనివి కాదు.

కేవలం ఫ్యాన్స్ కు హుషారు వస్తుంది. హీరోల మార్కెట్ బాగుందన్న కలర్ రావాలి. అంతకు మించి వీటి వల్ల ప్రయోజనం వుండదు. సినిమా బాగుంటేనే టికెట్ ముక్క తెగేది. ఇప్పటికే ఇలా రేట్ల‌ హడావుడి జరిగి, థియేటర్ దగ్గర ఓపెనింగ్ కు సైతం ఇబ్బంది పడిన సినిమాలు చాలా వున్నాయి. ఇప్పుడు సినిమాకు కావాల్సింది. ఈ గ్యాసిప్ లు, బజ్ లు కాదు. కంటెంట్. కంటెంట్ వుంటే ఓపెనింగ్ రాకపోయినా, రన్నింగ్ అదరగొడుతుంది.