బ్యాంక్లో తనఖా పెట్టిన భూమిని, ప్లాట్లగా వేసి తమకు విక్రయించిందని, ఈ విషయం తెలియక మోసపోయామని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వాసులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఆ ప్లాట్లను స్వాధీనం చేసుకుంటున్నట్టు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వాధీన ప్రకటన చేసింది. దీంతో టీడీపీ మహిళా నాయకురాలు, మాజీ మంత్రి అఖిలప్రియ మోసం వెలుగు చూసిందని బాధితులు వాపోతున్నారు.
కర్నూలు జిల్లాలో భూమా కుటుంబ రాజకీయ నేపథ్యం గురించి అందరికీ తెలుసు. భూమా నాగిరెడ్డి, శోభా దంపతులు వ్యాపార అవసరాల కోసం నంద్యాల ఆంధ్రా బ్యాంక్లో తమ ఆస్తుల్ని తనఖా పెట్టారు. నాగిరెడ్డి జీవించినంత కాలం నెలవారీ కంతులు చెల్లించేవారు. నాగిరెడ్డి దంపతుల మరణానంతరం బ్యాంకు లోన్లు కట్టడం మానేశారు. దీంతో పలుమార్లు భూమా నాగిరెడ్డి వారసులైన అఖిలప్రియ, ఆమె కుటుంబ సభ్యులకు బ్యాంక్ అధికారులు నోటీసులు పంపారు. అయినప్పటికీ స్పందించలేదు.
బ్యాంకుల విలీనం నేపథ్యంలో ఆంధ్రా బ్యాంక్ జాతీయ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్లో కలిసిపోయిన సంగతి తెలిసిందే. దీంతో యూనియన్ బ్యాంక్ భూమా నాగిరెడ్డి కుటుంబంతో పాటు ఆయన స్నేహితుడైన సుబ్బారెడ్డికి సంబంధించి ఆస్తుల స్వాధీన ప్రకటనలు చేసింది. ప్రస్తుతం రూ.8 కోట్ల రుణానికి సంబంధించి సుమారు రూ.30 కోట్ల స్థిరాస్తిని స్వాధీనం చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఇందులో భాగంగా ఆళ్లగడ్డలో బాలాజీ టౌన్షిప్, విశ్వరూప్నగర్, జీసస్ క్రైస్ట్ నగర్లో భూమా బ్రహ్మానందరెడ్డి పేరుపై ఉన్న దాదాపు 40 ప్లాట్లు కూడా స్వాధీన జాబితాలో ఉన్నాయి.
ఈ ప్లాట్లకు సంబంధించి యాజమాన్య హక్కును అఖిలప్రియకు ఇస్తూ… భూమా బ్రహ్మానందరెడ్డి జీపీఏ రాయించారు. పదేళ్ల క్రితం తనఖా పెట్టిన భూమిని చక్కగా ప్లాట్లు వేసి, వాటిని విక్రయించి అఖిలప్రియ సొమ్ము చేసుకున్నారు. బ్యాంక్లో తనఖా పెట్టిన విషయం తెలియకుండా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో మేనేజ్ చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. తమ ప్లాట్లు యూనియన్ బ్యాంక్ స్వాధీనం చేసుకోవడంపై ఏం చేయాలో దిక్కుతోచక ఆళ్లగడ్డలో రోడ్ల వెంబడి బాధితులు తిరుగుతున్నారు.
ఇదేమని ప్రశ్నించినా అఖిలప్రియ నుంచి బెదిరింపులు తప్ప, సానుకూల సమాధానం రాలేదని ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. పెద్దింటి కుటుంబని నమ్మి ప్లాట్లను కొంటే, చివరికి దిక్కులేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. ఎంతో కష్టపడి, ప్రతి రూపాయి కూడబెట్టి అఖిలప్రియ చేతిలో పెట్టామని, ఆమె మాత్రం తమ ప్లాట్లను బ్యాంకు స్వాధీనం చేశారని, చంద్రబాబు, లోకేశ్ ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఇదిలా వుండగా బ్యాంక్ స్వాధీనం చేసుకున్న వాటిలో భూమా దంపతుల సమాధులున్న ఘాట్ కూడా ఉండడం గమనార్హం. ఇదే బ్యాంక్లో భారీ మొత్తంలో రుణం ఉందని, దానికి సంబంధించి కూడా త్వరలో మరో స్వాధీన ప్రకటన రానుందనే చర్చ కర్నూలు జిల్లాలో సాగుతోంది.