ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమను పట్టించుకోలేదనే అక్కసు వామపక్ష నేతల్లో బలంగా వుంది. చంద్రబాబు మాదిరిగా తమను దగ్గరికి తీసుకోరనే ఆవేదన సీపీఎం, సీపీఐ నేతలను వెంటాడుతోంది. బీజేపీతో ముడిపెట్టి జగన్‌ను పదేపదే తిట్టడానికి ఇదే కారణం. విశాఖ పట్నానికి ప్రధాని మోదీ 11న రాత్రి వస్తున్నారు. 12న పలు ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే కొన్నింటిని జాతికి అంకితం చేయనున్నారు.
ఏపీకి ద్రోహం చేసిన ప్రధాని మోదీకి రాష్ట్రంలో అడుగు పెట్టే హక్కే లేదని వామపక్షాలు మండిపడుతున్నాయి. అలాగే ప్రధాని మోదీకి జగన్ ఎలా ఘన స్వాగతం పలకనున్నారని వామపక్ష నేతలు ప్రశ్నించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రధాని పర్యటనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని సీపీఎం పిలుపునిచ్చింది.
విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై ప్రధాని మోదీని నిలదీయాలని జగన్‌కు వామపక్షాల నేతలు సూచిస్తున్నారు. మోదీని ఎందుకు నిలదీయడం లేదని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇదే ప్రశ్న టీడీపీ, జనసేన నేతలకు వేసేందుకు మాత్రం సీపీఐ, సీపీఎం నేతలకు నోరు రావడం లేదు. బీజేపీకి జనసేన మిత్రపక్షం. బీజేపీతో టీడీపీ పొత్తు కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్ర హక్కులపై అధికార పక్షానిది ఎంత బాధ్యతో, అదే స్థాయిలో ప్రతిపక్షానికి కూడా వుంటుందని వామపక్ష పార్టీలకు తెలియకపోవడం విడ్డూరంగా వుంది.
బీజేపీ మిత్రుడైన పవన్‌కల్యాణ్‌తో ఇటీవల ఇప్పటంలో సీపీఎం నేత మధు అంటకాగారు. అధికారికంగా బీజేపీతో పవన్ విడిపోయామని ప్రకటించేంత వరకూ పొత్తులో ఉన్నారనే అనుకోవాలి. ఎందుకంటే ఆ రెండు పార్టీలు ఇదే మాట చెబుతున్నాయి కాబట్టి. సైద్ధాంతికంగా తీవ్ర విభేదాలున్న బీజేపీ మిత్రుడితో సీపీఎం, సీపీఐ నాయకులు ఎలా కలిసి వెళుతున్నారనే విమర్శలొస్తున్నాయి.
తమతో వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉన్న చంద్రబాబు బీజేపీతో దోస్తీ కుదుర్చుకున్నా వీరికి మాత్రం ఎలాంటి అభ్యంతరం వుండదన్న మాట. ద్వంద్వ విధానాలతో రాజకీయాలు చేయడం వామపక్షాల నేతలకే చెల్లుబాటు అవుతాయనే విమర్శలు నెలకున్నాయి.