ఎలాగైనా జగన్‌ను సీఎం గద్దె నుంచి దించాలని జనసేనాని పవన్‌కల్యాణ్ పట్టుదలతో ఉన్నారు. అయితే అది తన ఒక్కడి వల్ల కాదని ఆయనకు తెలిసిపోయింది. 2014లో మాదిరిగా టీడీపీ, బీజేపీతో పాటు తాను కూటమి కడితే తప్ప, జగన్‌ను అధికారానికి దూరం చేయలేమని ఆయన ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో టీడీపీతో ఆయన ఓ అవగాహనకు వచ్చారు. ఇక బీజేపీని కూడా టీడీపీతో జత కట్టించే బాధ్యతను భుజాన ఎత్తుకున్నారు. ఇందులో భాగంగా పవన్‌కు బీజేపీ రాజకీయంగా ఓ టాస్క్ ఇచ్చింది. అదేంటంటే… బీజేపీ వర్గాల ద్వారా అందిన కీలక సమాచార వివరాలిలా ఉన్నాయి.
బీజేపీ అధిష్టానానికి, పవన్‌కు మధ్య వారధిలా వ్యవహరించే నాయకుడొకాయన బెంగళూరులో వుంటారు. ఇటీవల ఆ నాయకుడిని పవన్‌కల్యాణ్ కలిశారు. ఎలాగైనా అమిత్‌షాతో అపాయింట్‌మెంట్ ఇప్పించాలని పవన్ రిక్వెస్ట్ చేశారు. సదరు నాయకుడు పలు దఫాలు ప్రయత్నించగా, చివరికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అపాయింట్‌మెంట్ దొరికింది.
ఇదే పదివేలని భావించిన పవన్‌కల్యాణ్ నడ్డాతో భేటీ అయ్యారు. జగన్‌ను గద్దె దించడంపై గట్టి వాదన వినిపించారు. టీడీపీతో జత కట్టాలని అభ్యర్థించారు. పవన్ చెప్పిందంతా విన్న నడ్డా…పొత్తు సంగతి తర్వాత చూద్దామని, ముందు ఉమ్మడి కార్యక్రమాలపై దృష్టి సారించాలని, ఆ దిశగా పని చేయాలని హితవు పలికారు. పవన్ నిరాశతో వెనుదిరిగారు. బెంగళూరు వెళ్లి సదరు నాయకుడితో మళ్లీ భేటీ అయ్యారు.
ఈ లోపు ఢిల్లీ నుంచి మధ్యవర్తిత్వం వహిస్తున్న నాయకుడికి వర్తమానం అందింది. పవన్ కోరుకుంటున్నట్టు టీడీపీతో పొత్తు కుదుర్చుకోడానికి సిద్ధమని, ఓ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేయాల్సి వుంటుందని బీజేపీ షరతు విధించింది. అదేంటంటే…బీజేపీ-పవన్ కూటమికి రెండున్నరేళ్ల సీఎం పదవి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరిస్తారా? ఒప్పించే బాధ్యతను పవన్ తీసుకోవాలని బీజేపీ అధిష్టానం సదరు నాయకుడి ద్వారా చెప్పించింది.
బీజేపీ ఇచ్చిన షాక్‌తో పవన్‌కు నోట మాట రాలేదు. చంద్రబాబుతో మాట్లాడ్తానంటూ బెంగళూరు నుంచి చెవ్వులు ఊపుకుంటూ పవన్ హైదరాబాద్‌కు వెళ్లిపోయినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ ఇచ్చిన టాస్క్‌ను పవన్ ఎంత మాత్రం నెరవేరుస్తారో చూడాలి. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేకే, తనకు మెలిక పెట్టిందని పవన్ వాపోతున్నారని సమాచారం.