నువ్వు రాజీనామా చెయ్.. ముందు నువ్వు చెయ్

తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు, ప్రతి సవాళ్లు ఇప్పుడు కామన్ గా మారిపోయాయి. దమ్ముంటే రాజీనామా చెయ్, ముందు నువ్ చెయ్ అంటూ ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. ఆమధ్య రేవంత్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య…

తెలంగాణ రాజకీయాల్లో సవాళ్లు, ప్రతి సవాళ్లు ఇప్పుడు కామన్ గా మారిపోయాయి. దమ్ముంటే రాజీనామా చెయ్, ముందు నువ్ చెయ్ అంటూ ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. ఆమధ్య రేవంత్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య మాటల తూటాలు ఓ రేంజ్ లో పేలాయి. ప్రెస్ మీట్ లోనే తొడలు చరుచుకునేవరకు వెళ్లారు మంత్రి వర్యులు. ఇప్పుడు తాజాగా కేటీఆర్, బండి సంజయ్ మధ్య ఇలాంటి సవాళ్లు టాక్ ఆఫ్ తెలంగాణగా మారాయి.

సహజంగా సవాళ్లకు, ప్రతి సవాళ్లకు దూరంగా ఉంటారు కేటీఆర్. ఎవరు రెచ్చగొట్టినా పెద్దగా రెచ్చిపోరు, ఆవేశ పడరు. అలాంటి కేటీఆర్ కూడా బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. పైసలు కేంద్రానివి, సోకులు రాష్ట్రానివి అంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. 

తెలంగాణ నుంచి పన్నుల రూపంలో 2.72 లక్షల కోట్లు కేంద్రానికి వెళ్తే, కేవలం 1.42 లక్షల కోట్లు మాత్రమే తిరిగి అభివృద్ధి నిధుల రూపంలో తెలంగాణకు దక్కాయని విమర్శించారాయన.

గద్వాల్ నుంచి సవాల్ విసురుతున్నానని, తాను చెప్పిన విషయాలు అసత్యమైతే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, తప్పని నిరూపించలేకపోతే బండి సంజయ్ తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఇలా రాజీనామా సవాల్ చేస్తారని ఎవరూ ఊహించి ఉండరు. అయితే బండి సంజయ్ కి ఇలా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్.

నీకంత సీన్ లేదు,, నీ తండ్రి రాజీనామా చేయాలి..

కేటీఆరే అనుకుంటే, అంతకంటే స్ట్రాంగ్ గా ఆయనకు మరో కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. యూపీఏ ప్రభుత్వం కంటే 9శాతం అదనంగా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు ఇచ్చిందని చెప్పారు సంజయ్. కేటీఆర్ అజ్ఞాని అని, తుపాకి రాముడని ఎద్దేవా చేశారు. 

తనకు సమ ఉజ్జీగా రాజీనామా చేయడానికి కేటీఆర్ సరిపోడని, కేసీఆర్ రావాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ని ఎవరూ పట్టించుకోరని, కేసీఆర్ వస్తే తామిద్దరం ప్రధాని మోదీ వద్దకు వెళ్లి రాజీనామా చేస్తామని చెప్పారు. కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగిడినట్టు టీఆర్ఎస్ నేతలు లీకులు ఇస్తున్నారంటూ మండిపడ్డారు సంజయ్.

మొత్తమ్మీద తెలంగాణలో రాజీనామాల రాజకీయం మరోసారి వేడెక్కింది. బీజేపీ నేతలు రెచ్చగొట్టడంతో కేటీఆర్ ఈసారి కాస్త ఆవేశపడ్డారు. రాజీనామా చేస్తావా సంజయ్ అంటూ సవాల్ విసిరారు. రాజకీయ నాయకులు చేసే ఇలాంటి సవాళ్లను ప్రజలెవరూ అంత సీరియస్ గా తీసుకోరు కానీ, కాసేపు పొలిటికల్ వాతావరణం మాత్రం హీటెక్కింది.