ఏపీ రాజకీయాల్లో ప్రతిసారి వేవ్ రావాల్సిందే. అప్పుడు మాత్రమే ఓటరు స్పష్టమైన మెజారిటీ ఇస్తున్నాడు. గతంలో రాష్ట్ర విభజన టైమ్ లో మోదీ-పవన్ వేవ్ చంద్రబాబుకు అనుకూలంగా మారింది. అంతకంటే ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేవ్ నడిచింది.
ఇక గత ఎన్నికల్లో 2019లో జగన్ వేవ్ నడిచింది. ఇలా ప్రతిసారి ఎన్నికలకు ముందు ఓ వేవ్ పనిచేస్తోంది. ఈసారి 2024లో అలాంటి వేవ్ తనకు అనుకూలంగా వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. జగన్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత రోజురోజుకు పెరిగి ఓ వేవ్ లా మారి, అది టీడీపీకి అనుకూలంగా మారుతుందని చంద్రబాబు అంచనా.
ఆశ ఉండాలి, కానీ మరీ దురాశ ఉండకూడదు. కానీ చంద్రబాబు ఆ దురాశతోనే ఉన్నారు. ఏపీలో సరికొత్త వేవ్ వస్తుందని, అది టీడీపీకి అనుకూలంగా మారుతుందని అనుకుంటున్నారు. అయితే ఇప్పటికీ జగన్ వేవ్ మాత్రమే ఏపీలో ఉంది. పాదయాత్ర సందర్భంగా ఆయన ఇచ్చిన హామీలను, అధికారంలోకి వచ్చిన వెంటనే అమలులో పెట్టారు.
రెండున్నరేళ్లు కాకుండానే తన పాలనేంటో ప్రజలకు రుచి చూపించారు. జగన్ కి ప్రతికూలంగా మారతాయని టీడీపీ వేసుకున్న లెక్కలు, పెట్టుకున్న అంచనాలన్నీ తలకిందులవ్వాల్సిందే. ఎందుకంటే.. ఇప్పటి వరకూ జగన్ పై నెగెటివ్ వేవ్ లేదు, ముందు ముందు వస్తుందన్న అంచనాలు కూడా లేవు. మరి చంద్రబాబు అంచనా వేసుకున్న వేవ్ ఏంటో ఆయనకే తెలియాలి.
వారసుడిపై నమ్మకం లేకనే..
భవిష్యత్తుపై ఆశతో ఉన్న నాయకులెవరైనా తమ సామర్థ్యాన్ని ఎక్కువగా ఊహించుకుంటారు, అవకాశం ఉంటే తమ సత్తా చాటుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. కానీ ఇక్కడ చంద్రబాబుకి తనపై, తన వారసుడిపై ఏమాత్రం నమ్మకం లేదు.
కేవలం జగన్ తప్పులు చేస్తారని, అలా తనకి కలసొస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే టీడీపీ నేతలందరికీ అర్థమైపోతుంది. అందుకే తెలుగుదేశం జనాలంతా జగన్ ఎప్పుడు తప్పులు చేస్తారా అని ఎదురుచూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఆయన తప్పులు చేస్తేనే వీళ్లకు మైలేజీ అనే ఒక వింత స్థితిలో పడిపోయారు పచ్చ బ్యాచ్ అంతా.
బీజేపీ-జనసేనతో కలసిపోవాలనే తహతహ..
సొంతగా బరిలో దిగితే 2019లో వచ్చిన దానికంటే రిజల్ట్ మరింత దారుణంగా ఉంటుందని చంద్రబాబుకి తెలుసు. అందుకే 2024లో బీజేపీ, జనసేనతో కలసి వెళ్లడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇప్పటినుంచే దానికోసం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. కేంద్రాన్ని పల్లెత్తు మాట అనరు, పెట్రోల్ రేట్లు పెరిగినా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అంటారు.
ప్రత్యేక హోదా గురించి పూర్తిగా మరచిపోయారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో కూడా తన పాత్ర లేకుండా చేసుకున్నారు. కేంద్రానికి ఇబ్బంది కలిగించే ఏ పని కూడా చేయకుండా బీజేపీకి నమ్మకస్తుడిగా ఉండి, 2024 ఎన్నికల్లో వారి చలవతో గెలవాలనేది చంద్రబాబు ఆలోచన.
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు కూడా ఇలా వేవ్ లపై నమ్మకం పెట్టుకోవడమే కాస్త కామెడీగా ఉంది. సొంత బలం లేకపోవడంతో పాటు, వారసుడు కూడా అసమర్థుడు కావడంతో.. జగన్ ఏ తప్పులు చేస్తారా.. బీజేపీ ఎప్పుడు స్నేహహస్తం అందిస్తుందా అని ఎదురు చూస్తున్నారు బాబు. బహుశా.. బాబు భ్రమపడుతున్న వేవ్ అంటే ఇదేనేమో.