సర్వోన్నత న్యాయస్థానం సిఫార్సులనే కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈ విషయాన్ని స్వయంగా సుప్రీంకోర్టే వెల్లడించడం గమనార్హం. తమ సిఫార్సులను పక్కన పెట్టిన కేంద్ర ప్రభుత్వంపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహించింది. న్యాయవర్గాల్లో ఇది చర్చకు దారి తీసింది.
ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీని వారంలోపు చేపట్టాలని చివరి వార్నింగ్‌గా కేంద్రానికి సుప్రీంకోర్టు గత వారం ఇచ్చిన సంగతి తెలిసిందే. వారంలోపు నియామకాలు చేపట్టకపోతే చర్యలు తప్పవని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు ట్రైబ్యునళ్లలో నియామకాలు చేపట్టి 84 మంది సభ్యులను నియమించింది. అందుకు సంబంధించిన వివరాలతో కూడిన అఫిడ విట్‌ను సుప్రీంకోర్టు సమర్పించింది.
ఈ అఫిడవిట్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. ఖాళీల భర్తీ, ఎంపిక విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు జడ్జీల ఆధ్వర్యంలోని సెర్చ్ అండ్ సెలక్షన్ కమిటీ సిఫార్సు చేసిన వ్యక్తులను కాకుండా వెయిటింగ్ లిస్ట్‌లో నుంచి సభ్యులను ఎంపిక చేయడంపై ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం మండిపడింది.
‘ట్రైబ్యునల్ కోసం 9 మంది జ్యుడీషియల్ సభ్యులు, 10 మంది టెక్నికల్ సభ్యులను కమిటీ ప్రతిపాదించింది. ఈ జాబితా నుంచి కేవలం ముగ్గురిని మాత్రమే ఎంపిక చేసి అపాయింట్‌మెంట్ లెటర్ ఇచ్చారు. మిగతా వారిని వెయిటింగ్ లిస్ట్ నుంచి తీసుకు న్నారు. సెలక్ట్ లిస్ట్‌ను పక్కనబెట్టి వెయిట్ లిస్ట్‌లో నుంచి సభ్యులను ఎంపిక చేయకూడదు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. రూల్ ఆఫ్ లా..రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉండాలి’అని చీఫ్ జస్టిస్ ఘాటు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరిం చుకుంది.
కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ తాము ఎంతో కష్టపడి దేశవ్యాప్తంగా ఇంటర్వ్యూలు చేసి, కొందరి పేర్లను సిఫార్సు చేస్తే.. వాటిని కేంద్రం పక్కనబెట్టడం ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. తమ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది. సెలక్ట్ జాబితా నుంచి అందర్నీ నియమించలేమని కేంద్రం చెబుతోందని, తమ సమయాన్ని వృథా చేసుకున్నామని చీఫ్ జస్టిస్ ఆవేదన వ్యక్తం చేశారు.
దీనికి అటార్నీ జనరల్ స్పందిస్తూ.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే నియామకాలు చేపట్టామన్నారు. సభ్యుల ఎంపి కపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని అటార్నీ జనరల్ తేల్చి చెప్పారు. అన్ని వివరాలతో వారం లోపు కౌంటర్ దాఖలు చేస్తామని ఏజీ చెప్పగా, కోర్టు తిరస్కరించింది.
కౌంటర్ దాఖలు చేయడం పరిష్కారం కాదని ధర్మాసనం వ్యాఖ్యానిం చింది. రెండు వారాల్లోపు సరైన సభ్యులతో నియామకాలు చేపట్టి.. అపాయింట్‌మెంట్ లెటర్లతో రావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ స్పందనపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది.