దేశ రాజధానిలో ఈ ఏడాది కూడా టపాసులపై నిషేధం కొనసాగుతుందని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. వరసగా మూడేళ్లుగా టపాసులు పేల్చడంపై నిషేధాన్ని విధిస్తూ వస్తోంది అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం. ఈక్రమంలో ఈ ఏడాది కూడా అదే జరుగుతుందని ఆయన ట్వీట్ చేశారు. దీపావళి సందర్భంగా ఈ ఏడాది కూడా టపాసులకు అనుమతి లేదని, వాటిని స్టాక్ ఉంచుకోవడానికి కానీ, అమ్మడానికి కానీ, పేల్చడానికి కానీ అనుమతి లేదని ఆయన స్పష్టం చేశారు. దీపావళికి ఇంకా సమయం ఉండగానే ఢిల్లీ సీఎం స్పందించారు.
దేశ రాజధానిలో కాలుష్య తీవ్రత నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ వస్తోంది. దీనిపై వీర హిందుత్వ వాదులు తీవ్రంగా స్పందిస్తూనే ఉన్నారు. హిందువుల పండగలే కాలుష్యానికి కారణం అవుతాయా? అని ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈ వ్యవహరం కోర్టుల వరకూ కూడా చేరింది. అయితే కోర్టులు కూడా ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తూ ఉన్నాయి.
అయితే బీజేపీకి రాజకీయంగా ఇలాంటి అంశాలు బాగానే ఉపయోగపడుతున్నాయి. ఇటీవల వినాయకచవితి ఉత్సవాలను బాగానే రాజకీయంగా వాడుకుంది కమలం పార్టీ. కరోనా తీవ్రత దృష్ట్యా ఏపీతో సహా వివిధ రాష్ట్రాలు వినాయక చవితి సామూహిక ఉత్సవాలను రద్దు చేశాయి. ఇందులో బీజేపీ పాలిత కర్ణాటక కూడా ఉంది! అయితే.. తాము ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ రాజకీయంగా ఇలాంటి అంశాలను వాడుకుంటూ వచ్చింది. అదే హిందుత్వవాదమని అంటోంది.
దేశంలో వినాయకచవితి ఉత్సవాలను అనుమతించాల్సిందేనంటూ బీజేపీ తిరుగులేని నాయకత్వంలోని కేంద్రం ఆదేశించదు. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా రిస్కు తీసుకోరు. అధికారంలో లేని చోట మాత్రం ఉత్సవాలు కావాల్సి వస్తాయి. ఇక ఢిల్లీలో కాలుష్యం గురించి బీజేపీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. పార్లమెంటులో ఎయిర్ ఫిల్టర్లు పెట్టుకునే పరిస్థితి ఉందక్కడ. ఢిల్లీ కాలుష్యం గురించి కోర్టు కూడా ప్రభుత్వాలను పదే పదే ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏం చర్యలు తీసుకుంటున్నారు? అని నిలదీస్తూ ఉంటుంది.
ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమయమైన నగరాల జాబితాలో ఢిల్లీ ముందు వరసలో ఉంటుంది. చలికాలం ఢిల్లీ లో పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉంటాయి. ఢిల్లీ, గుర్గావ్ ప్రాంతాల్లో ఉద్యోగం చేయడం కూడా కేవలం దురదృష్టం అన్నట్టుగా సౌతిండియన్ ఉద్యోగులు చెప్పుకుంటారు. ఇలాంటి నేపథ్యంలో ఎంతో కొంత తీవ్రతను తగ్గించడానికి క్రాకర్స్ పై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధిస్తూ వస్తోంది. అయితే.. క్రాకర్స్ హిందువులకు అతి పవిత్రమైనవి అన్నట్టుగా వాట్సాప్ యూనివర్సిటీ చెప్పుకొస్తుంది.
వాస్తవానికి ఈ పటాసులను కనుగొన్నదే చైనా వాళ్లు అనేది వాట్సాప్ యూనివర్సిటీ చెప్పదు. అవెలా హిందువులకు పవిత్రం అయ్యాయి? దీపావళి అంటే దీపాల వరస కదా.. మధ్యలో పటాసులు ఎక్కడ నుంచి వచ్చాయంటే సమాధానాలు ఉండవు. పటాసుల నిషేధం అంటే.. హిందూ మతం ప్రమాదంలో పడ్డట్టుగా అనిపిస్తుందంతే!