తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణి కాలనీలో బాలికపై హత్యాచారం ఘటనను రేవంత్‌రెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. ఈ సందర్భంగా నిందితుడు పోలీసుల అదుపులోనే వున్నాడని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
పోలీసులు అదుపులో నిందితుడు లేడని తెలుసుకున్న కేటీఆర్ క్షమాపణ చెప్పడంతో పాటు ట్వీట్‌ను తొలగించారు. బాలికపై హత్యాచారానికి పాల్పడ్డ నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నామని, కఠినంగా శిక్షించాలని హోంమంత్రి, డీజీపీకి మంత్రి కేటీఆర్ ట్వీట్ ఎలా చేశారు? అని రేవంత్ ప్రశ్నించారు.
ఐదు రోజుల తర్వాత నిందితుడు పరారీలో ఉన్నాడని పట్టుకుంటే రూ.10 లక్షల రివార్డు ప్రకటించారని చెప్పుకొచ్చారు. కానీ పోలీసుల అదుపులోనే నిందితుడు ఉన్నాడని కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా? అని రేవంత్‌రెడ్డి ఘాటు ప్రశ్నలు కురిపించారు.
మహిళలపై దాడులకు ప్రధాన కారణం మద్యమేనని పోలీసుల రికార్డులు చెబుతున్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. 2021లో ఇప్పటి వరకు 1,750 రేప్ కేసులు జరిగాయని ఆయన చెప్పారు. అత్యంత పాశవిక సంఘటనలు జరగడానికి మద్యం, డ్రగ్స్ కారణమని వివరించారు.
కేసీఆర్ ఏడేళ్ల పాలనలోని అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఈ నెల 17న రాష్ట్రానికి వస్తున్న కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా అపాయింట్మెంట్ అడిగినట్టు రేవంత్ తెలిపారు. అమిత్‌షా అపాయింట్మెంట్ ఇస్తే…ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి ఫిర్యాదు చేస్తామన్నారు.