ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అనుకూలంగా సీబీఐ కోర్టులో తీర్పు రావడాన్ని కొందరు జీర్ణించుకోలేకున్నారు. మరీ ముఖ్యంగా జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసిన రఘురామకృష్ణంరాజు తన నిరసనను …కాస్తా వ్యంగ్యం జోడించి చెప్పారు. ఇది న్యాయస్థానాన్ని అగౌరవపరిచేలా ఉందనే అభిప్రాయాలు న్యాయవర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.
జగన్ , విజయసాయిరెడ్డిల బెయిల్ పిటిషన్లను సీబీఐ కోర్టు రద్దు చేయడంపై పిటిషనర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. సాక్షి దినపత్రిక వార్తే నిజమని తేలిందని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌ను సీబీఐ కోర్టు రద్దు చేసిందని సాక్షి వెబ్ పేజీలో ఇటీవల కథనం ప్రచురితం కావడం విమర్శలకు తావిచ్చింది. ఇది కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందంటూ రఘురామ మరో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై ప్రస్తుతం విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై సాక్షి వార్తే నిజమైందని రఘురామ వ్యాఖ్యానించడం ద్వారా, న్యాయస్థానం విశ్వసనీయతను దెబ్బతీసినట్టేనని చెబుతున్నారు. ఇదిలా ఉండగా న్యాయస్థానాలను అపార్థం చేసుకునే అవకాశం ఉంటుందని, అది మంచిది కాదనే ఉద్దేశంతో తన పిటిషన్‌ను వేరే బెంచ్‌కు ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించిన విషయాన్ని ఈ సందర్భంగా రఘురామ గుర్తు చేయడాన్ని న్యాయవాద వర్గాలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి.
తాజాగా బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు రద్దు చేసిన నేపథ్యంలో…న్యాయస్థానాలను అపార్థం చేసుకునేలా తీర్పు ఉందని రఘురామ పరోక్షంగా చెప్పారనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.