ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలకు సంబంధించిన కేసుల్లో ఎంపీ రఘురామకృష్ణంరాజుకు గోడేటు, చెంపేటు తప్పలేదు. ఇటు సీబీఐ, అటు హైకోర్టుల్లో రఘురామకు ఎదురు దెబ్బలు తగిలాయి.
జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలని వేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టి వేసింది. అలాగే బెయిల్ రద్దు పిటిషన్లపై సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వకుండా నిరోధిం చాలని వేసిన పిటిషన్‌ను అంతకు ముందు హైకోర్టు కొట్టివేయడంతో వరుస ఎదురు దెబ్బలు తగిలినట్టైంది.
అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి , ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ కోర్టులో రఘురామకృష్ణంరాజు వేర్వేరుగా పిటిషన్లు వేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను జగన్, విజయసాయి ప్రభావితం చేస్తున్నారని పిటిషన్లలో పేర్కొన్నారు.
గత రెండు మూడు నెలలుగా సుదీర్ఘ విచారణ జరిగింది. సీబీఐ కోర్టు విధించిన షరతులను జగన్, విజయసాయిరెడ్డి అతిక్రమించారని, వారి బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదులు వాదించారు. తాము ఎలాంటి షరతులు ఉల్లంఘించలేదని.. కేవలం రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రఘురామ పిటిషన్ దాఖలు చేశారని జగన్ తరఫు న్యాయవాదులు దీటైన వాదనలు వినిపించారు.
పిటిషనర్ తరపు వాదనల్లో సహేతుక లేకపోవడంతో జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దుకు సీబీఐ కోర్టు నిరాకరించింది. దీంతో జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు అవుతుందని కొంత కాలంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్లకు తీవ్ర నిరాశ తప్ప లేదు.
ఇదిలా ఉండగా జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ కోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ల బదిలీకి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు కొట్టి వేయడంతో హైకోర్టుకు వెళ్లనున్నట్టు రఘురామ తెలిపారు.