మంత్రి అనిల్‌కుమార్ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. దూకుడుగా వ్యవహరించే అనిల్‌కుమార్, ఇటీవల కాలంలో ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో నెలకున్న విభేదాలే మంత్రి అనిల్‌కుమార్ మౌనానికి కారణమని చెబుతున్నారు.
తనకు అత్యంత ఇష్టుడైన మంత్రిని ముఖ్యమంత్రి జగన్ పక్కన పెట్టారనే ప్రచారం గత కొంత కాలంగా జరుగుతోంది. మంత్రి కనిపించకపోవడంపై ప్రత్యర్థులు కూడా వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. మాజీ ఇరిగేషన్‌శాఖ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతూ మంత్రి అనిల్‌కుమార్ అదృశ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇరిగేషన్‌శాఖ గత 28 నెలల కాలంలో ఏం ఖర్చు పెట్టిందో చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఇరిగేషన్‌శాఖ మంత్రి అనిల్‌కుమార్ మాట్లాడ్డం లేదన్నారు. అలాగే ఆయన అసలు కనిపించడం లేదని గుర్తు చేశారు.
ఇరిగేషన్ శాఖ గురించి ఏమి తెలుసని మంత్రి కన్నబాబు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ప్రశ్నించారు. పేదవాళ్లకు ఇచ్చే బియ్యంలో కోట్ల రూపాయిలు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తనపై విమర్శలకైనా జవాబిచ్చేందుకు మంత్రి అనిల్‌కుమార్ ఎక్కడున్నా మీడియా ముందుకొస్తారని ఆశిద్దాం.