పవన్ కల్యాణ్‌కు పాపం.. నిద్రలేని రాత్రులు..!

ఆయన వెండితెరవేల్పు! ఆయన తెరమీద కనిపించగానే విజిల్స్ పడతాయి.. కేరింతలు వినిపిస్తాయి. ఆయన చెయ్యెత్తి ఊపితే.. లక్షలమంది హర్షధ్వానాలు చేస్తారు. కానీ.. ఏం చేయగలడు? పాపం.. ఇప్పుడు ఆయన అస్తిత్వానికే విలువ లేకుండా పోయింది!…

ఆయన వెండితెరవేల్పు! ఆయన తెరమీద కనిపించగానే విజిల్స్ పడతాయి.. కేరింతలు వినిపిస్తాయి. ఆయన చెయ్యెత్తి ఊపితే.. లక్షలమంది హర్షధ్వానాలు చేస్తారు. కానీ.. ఏం చేయగలడు? పాపం.. ఇప్పుడు ఆయన అస్తిత్వానికే విలువ లేకుండా పోయింది! తనకు తాను సరికొత్త హీరోయిజాన్ని పులుముకోవడానికి చేసిన ప్రయత్నం కూడా వికటిస్తోంది. తాను తొడుగుగా వాడుకోదలచుకున్న హీరోయిజం.. డొల్లతనం ప్రజలకు తెలిసిపోతున్నది. అందుకే పవన్ కల్యాణ్ పాపం.. నిద్రలేని రాత్రులు గడుపుతుంటారు. ఎందుకో తెలుసా..

విశాఖలో 11వ తేదీన ప్రధాని మోడీ సభ జరగబోతోంది. రెండు రోజుల పాటు ప్రధాని విశాఖలోనే బస చేయబోతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించి.. ఎన్డీయే భాగస్వామ్య పార్టీ నాయకుడు పవన్ కల్యాణ్ కు మాత్రం కనీసం ఆహ్వానం కూడా లేదు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో మాత్రమే కాదు.. ప్రజల్లో కూడా తన పరువు సాంతం తీసేస్తుందని పవన్ కు దిగులుగా ఉంది. 

మామూలు పరిస్థితుల్లో అయితే.. పవన్ కు ఇంత దిగులు అనవసరం. కానీ.. 2014 ఎన్నికల్లో మోడీ సరసన బహిరంగ వేదికల మీద కూర్చున్న నాటినుంచి… పవన్ కల్యాణ్ ఒక రకమైన చిత్రభ్రమకు లోనయ్యారు. మోడీ కి తాను అత్యంత సన్నిహితుడినని అనుకున్నారు. దేశమంతా తిరిగే నాయకుడు.. వాడుకుని వదిలేసే ఆమాంబాపతు నాయకుల్లో తానూ ఒకడినని ఆయన గుర్తించలేకపోయారు. అప్పట్లో అవసరం కాబట్టి.. మోడీ నవ్వుతూ కరచాలనాలు, ఆలింగనాలు చేసుకునే సరికి తన స్థాయి గురించి ఎక్కువగా ఊహించుకున్నారు. 

ఆ భ్రమలో పాపం.. బహిరంగ సభలు పెట్టినప్పుడెల్లా.. తనకు ప్రధాని మోడీ చాలా సన్నిహితుడని.. తాను కావలిస్తే, ఆయనను అడిగి చిటికెలో ఎంపీ పదవి తెచ్చుకోలేనా? అని చాలా రకాల ప్రగల్భాలు పలికారు. అక్కడికేదో.. మోడీ పప్పులు బెల్లాలు పంచినట్లుగా పవన్ లాంటి వాళ్లందరికీ ఎంపీ పదవులు పంచుతున్నారనే భావనలో ఆయనలో ఉన్నట్టుంది. కానీ.. వాస్తవానికి వచ్చేసరికి.. మోడీ అనే నాయకుడు, పవన్ కల్యాణ్ అనే వ్యక్తిని అసలు పట్టించుకోవడం లేదు.. అని ఆయనకు నెమ్మదిగా అర్థమైంది. 

ఢిల్లీ వెళ్లినా అపాయింట్మెంట్ దొరకదు. అయినా సరే.. మోడీ నాకు చాలా క్లోజ్ అని చెప్పుకుంటూ.. ఏపీలో తన రాజకీయ స్థాయి పెంచుకోడానికి పవన్ ప్రయత్నించారు. తీరా ఏపీలో ప్రధాని కార్యక్రమం జరిగినా పవన్ ను పట్టించుకోలేదు. భీమవరం కార్యక్రమానికి పిలుపు లేదు. ఇప్పుడు విశాఖలో పెద్ద సభ నిర్వహిస్తోంటే.. కనీసం పట్టించుకోలేదు. అప్పటికీ.. బిజెపిలోని తన ఆప్తుల ద్వారా.. వేదిక ఎక్కేలా ఆహ్వానం కోసం పవన్ కల్యాణ్ ప్రయత్నించారు గానీ.. బిజెపి ఖాతరు చేయలేదు. అవమానంతో పవన్ రగిలిపోతున్నారు. 11వ తేదీ విశాఖలో సభ జరగబోతోంది. అప్పటిదాకా పవన్ కు పాపం నిద్రలేని రాత్రులే అని ప్రజలు అనుకుంటున్నారు.