జగన్ కిందా మీదా పడి, నానా కష్టాలు పడి గెలిచారు. గెలిచిన తరువాత తన ఎజెండా తనకు వుంది. తన టార్గెట్ లు తనకు వున్నాయి. వాటితో కుస్తీ పడుతున్నారు. ఈ తరుణంలో చేసిన తప్పు ఒప్పుల భారం అంతా జగన్ మోయాల్సిందే. తప్పదు. కానీ ఇదే సమయంలో కింది స్థాయిలో కూడా చోటా మోటా నాయకుల దగ్గర నుంచి, ఓ రేంజ్ నాయకుల వరకు ఎవరి వ్యవహారాలు వారు చక్క పెట్టేస్తున్నారు. వాళ్ల పగ వాళ్లు తీర్చేసుకుంటున్నారు. ఇది వాస్తవం. కాదనలేనిది.
పేర్లు అనవసరం కానీ, ఎవరూ తక్కువా కాదు. ఎక్కువా కాదు. వీటిలో కొన్ని మాత్రం అత్యుత్సాహంతో చేసినవి. గతంలో వకీల్ సాబ్ టైమ్ లో టికెట్ లు రేట్లు తగ్గించడం లాంటి వ్యవహారాలు ఈ కోవకే వస్తాయి. తెలంగాణలో కాంగ్రెస్ ను కాదని భాజపాను టార్గెట్ చేసి, దాన్ని పెంచి పోషించారు తెరాస నాయకులు. ఇక్కడ వైకాపా నేతలు అదే చేస్తున్నారు. తేదేపాను వదిలేసి పవన్ టార్గెట్ చేసి, అనవసరంగా అతగాడిని పెంచి పెద్ద చేస్తున్నారు.
సరైన విధి విధానాలు పాటించకో, మరెందుకో మొత్తం మీద కొర్టుల్లో తీర్పులు తమకు అనుకూలంగా వచ్చే అవకాశాలు తక్కువ అని తెలుసు. తెలిసి కూడా అరెస్ట్ లు చేయడం, కోర్టుల చేత మొట్టికాయలు మొట్టించుకోవడం, ప్రతి విషయంలో ఎదురు దెబ్బలు తినడం అలవాటు అయిపోయింది. లేటెస్ట్ గా జనసేన సభకు స్థలం ఇచ్చిన గ్రామంలో రోడ్ల వెడల్పుల వ్యవహారమే కావచ్చు. గట్టిగా సమర్థించుకోలేకపోయారు. ముందుగానే వైఎస్ బొమ్మ కూడా తీసి వుంటే వేరుగా వుండేది.
పవన్ నానా హడావుడి చేసాక అప్పుడు తీసారు. ఇప్పుడు పోయింది ఎవరి పరువు? ఇప్పటం గ్రామంలో తమ తప్పు లేదు అని తెలిసినపుడు మీడియా జనాలను అందరినీ అక్కడికి ప్రభుత్వమే తీసుకెళ్లి, జనాలతో మాట్లాడించవచ్చు కదా? కేవలం సాక్షిలో రాసుకుంటే సరిపోతుందా?
ప్రభుత్వానికి వ్యతిరేకంగా వున్న వారిని ఏదో విధమైన కేసుల్లోకి తోస్తున్నారు. వాళ్లు ఇలా వెళ్లి అలా బెయిల్ తో బయటకు వస్తున్నారు. అక్కడి నుంచి మరింత జోష్ తో ప్రభుత్వం మీద ఎగబడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఒరిగింది ఏమిటి? అన్న ఆలోచన వుండడం లేదు. దేని మీదా ఎక్కడా క్లారిటీ ఇవ్వడం లేదు. పవన్ విశాఖ రావడం ప్లాన్ కావచ్చు. ఇప్పటం రావడం రాజకీయ వ్యూహం కావచ్చు. ఎందుకు అడ్డుకోవడం. వదిలేయవచ్చు కదా. అడ్డుకున్నా అదే ప్రసంగం..వదిలేసినా అదే ప్రసంగం. పైగా ప్రతిసారీ అడ్డుకోవడం వల్ల పవన్ కు వైకాపా భయపడుతున్నారన్న భావన జనాల్లోకి వెళ్లిపోతోందని గమనించడం లేదు.
జనసేనకు ఎలాగూ గ్రౌండ్ లెవెల్ లో బలం లేదని తేదేపాకు తెలుసు. తమ ఒళ్లు అలవకుండా ప్రతి దానికీ జనసేనను ముందుకు పంపిస్తోంది. జనసేన కష్టపడి యాంటీ గవర్నమెంట్ ఓట్ ను పెంచుతోంది. అంతా జరిగిన తరువాత జనాల ముందుకు వైకాపాకు పోటీగా తేదేపా వుంటుంది. జనసేన అక్కడక్కడ మెరుపులా కనిపిస్తుంది. జనాలకు అప్పటికే ప్రభుత్వం మీద కాస్త కోపం వుంటుంది. దాన్ని తీర్చుకోవడానికి ఆల్టర్ నేటివ్ గా తేదేపా కనిపిస్తుంది. అదే తెలుగుదేశం స్ట్రాటజీ. దీనికి జఙనసేన ఎందుకు సాయం చేస్తోందన్నది పవన్ కళ్యాణ్ కే తెలియాలి.
ఈ స్ట్రాటజీకి తెలిసో, తెలియకో వైకాపా జనాలు సాయం పడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా రాయలసీమ లో కన్నా ఉత్తర, దక్షిణ, తూర్పు కోస్తాల్లో వైకాపా జనాలు చేస్తున్న అత్యుత్సాహ చర్యలు ఎక్కువగా వుంటున్నాయి. కేవలం పథకాలు, వ్యవహారాలు మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా ఓ పద్దతి ప్రకారం చేయడం కాదు. పార్టీ పనులు, పగ తీర్చుకోవడాలు వీటన్నింటికి కూడా ఒక రాష్ట్రస్థాయి నిర్ణయాలు వుండాలి.
ఇది డిజిటల్ ప్రపంచం. అణువణువునా కెమేరాలు, రికార్డింగ్లు వుంటాయన్న బేసిక్ విషయం కూడా వైకాపా నాయకులు మరిచిపోతున్నారు. తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. మాట్లాడుతున్నారు. శ్రీకాకుళంలో ఎస్ ఐ ను స్టేజ్ ఎక్కించి డ్యాన్స్ చేయించినా, మరో చోట రోడ్డు మీద తన ఫోటొ ఫ్లెక్సీ మీద పెద్దగా పెట్టలేదని బాహాటంగా మాట్లాడినా, తిరుపతిలో దర్శనం కోసం హడావుడి చేసినా, ఇలా ఏం చేసినా, చేస్తున్నా అస్సలు ఇంగితం లేదనిపిస్తుంది.
తెలుగుదేశం హయాంలో ఇలాంటివి జరగలేదని కాదు. అక్కడ తమ ప్రభుత్వం కనుక కప్పి పెట్టింది ఓ సెక్షన్ మీడియా. ఇప్పుడు అదే మీడియా టముకేస్తోంది. ఈ విషయం అస్సలు పట్టక, వైకాపా నేతలు ఎవరి చిత్తానికి వారు ప్రవర్తిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు. దీని వల్ల నష్టపోయేది జగన్. నాయకులకు ఏం పోయింది..సింపుల్ గా జంప్ జిలానీ అంటారు కదా? జగన్ దీన్ని గమనించేలోగానే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోతోంది.
ఆర్వీ