ఆయన దేశ ప్రధాని. రాక రాక విశాఖ వస్తున్నారు. మరి ఆయన టూర్ అంటే అదిరిపోవాల్సిందే. పైగా ఆయన సభ అంటే జనాలు లక్షల్లో ఉండాల్సిందే. విశాఖలో మోడీ ఈ నెల 11, 12 తేదీలలో జరిపే పర్యటన చాలా ఖరీదైన టూర్ గా మారబోతోంది.
ప్రధాని సభ కోసం పది కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రెండు లక్షల మంది జనాలతో ఏయూ గ్రౌండ్స్ లో మీటింగ్ సాగనుంది. ప్రధాని సభకు జనాల తరలింపు కోసం 1500 వాహనాలను వినియోగించనున్నారు. అయిదు వేల మంది పోలీసులు విశాఖలో బందోబస్తు నిర్వహించనున్నారు. జిల్లాలో అధికారులతో పాతిక కమిటీలు పనిచేస్తున్నాయి. మరో పాతిక మంది నిరంతరం కలెక్టరేట్ లో ఉండి కంట్రోల్ రూం నుంది పర్యవేక్షిస్తారు.
ఇప్పటికే మోడీ భద్రత కోసం ఏర్పాట్లు చూసేందుకు ఎస్పీజీ బృందాలు నగరానికి చేరుకున్నాయి. మోడీ సభ కోసం పది కోట్లు ఖర్చు అవుతుందని లెక్కలేసి ప్రభుత్వానికి జిల్లా అధికారులు లేఖ రాశారు. రెండు రోజుల టూర్ లో మోడీ 11 వేల కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. ఇలా ఇంత పెద్ద ఎత్తున సాగే మోడీ టూర్ మాత్రం ఆసక్తిని రేపడంతో పాటు ఖర్చు పరంగా కూడా హెచ్చుగానే ఉందని అంటున్నారు.
మోడీ తో పాటు ముఖ్యమంత్రి జగన్ పాల్గొనే సభ విశాఖ చరిత్రలో కొత్త రికార్డులు సృష్టించేలా జరపాలని భావిస్తున్నారు. విశాఖ పాలనారాజధాని అంటూ ప్రభుత్వం ఫోకస్ చేస్తున్న నేపధ్యంలో మోడీ ప్రారంభించే అభివృద్ధి కార్యక్రమాలతో విశాఖ రూపు రేఖలే మారుతాయని అంటున్నారు.