స్టార్ హీరోయిన్ సమంత చేసిన హీరోయిన్ సెంట్రిక్ సినిమా యశోద. శ్రీదేవి మూవీస్ పతాకంపై కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు దర్శక ద్వయం హరి- హరీష్ పని చేసారు. ఈ సినిమా విడుదల నేపథ్యంలో సమంత ను ఏస్ యాంకర్ సుమ ఇంటర్వూ చేసారు. ఆ ఇంటర్వూ వివరాలు.
నా అనారోగ్య సమస్య నుంచి ఇప్పుడు నేను రికవరీ అవుతున్నాను. త్వరలో పరిస్థితులు మెరుగు అవుతాయని ఆశిస్తున్నాను. ఈ క్షణం, నేను ఈ రోజు గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ఈ రోజు 'యశోద' విడుదల గురించి ఎగ్జైట్ అవుతున్నాను. నా ఆరోగ్యం మీద నేనూ చాలా ఆర్టికల్స్ చూశాను. అయితే… ప్రస్తుతానికి నేను చావలేదు (నవ్వులు). ఆ హెడ్డింగ్స్ అప్రస్తుతం. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. ఫైట్ చేస్తున్నాను. నేను ఉన్న పరిస్థితిలో అది అంత ప్రాణాంతకం ఏమీ కాదు.
నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు… కొన్ని మంచి రోజులు ఉంటాయి. కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. ఒక్కోరోజు ఇంకొక్క అడుగు కూడా ముందు వేయలేనేమో అనిపిస్తోంది. కొన్ని రోజులు వెనక్కి తిరిగి వస్తుంటే ఇంత దూరం వచ్చానా? అనిపిస్తోంది. (సమాధానం చెబుతూ సమంత భావోద్వేగానికి లోనయ్యారు) చాలా మంది ఎన్నో సవాళ్లతో యుద్ధం చేస్తున్నారు. అంతిమంగా మనమే విజయం సాధిస్తాం.
కమింగ్ టు యశోద… టీజర్, ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది. చాలా సంతోషంగా ఉంది. ఎగ్జైట్ అయ్యాను. అదే సమయంలో కొంచెం నెర్వస్ కూడా ఉంది. టీజర్, ట్రైలర్లో మేము చూపించినది నిజమే. సినిమాలో ఏం ఉందో అదే చూపించాం. ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్లకు టీజర్, ట్రైలర్ నచ్చాయి. సినిమా కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను.
సాధారణంగా నేను ఏదైనా స్క్రిప్ట్ ఓకే చేయడానికి ఒక రోజు సమయం తీసుకుంటా. కానీ, 'యశోద' వెంటనే ఓకే చేశా. నేను విన్న వెంటనే ఓకే చేసేసిన కథల్లో 'యశోద' ఒకటి. 'యశోద' క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. పవర్ ఫుల్ స్టోరీ ఇది. అందుకని, ఎక్కువగా ఆలోచించడానికి ఏమీ లేదు. కథ విన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. థ్రిల్ అయ్యాను. ప్రేక్షకులు కూడా అదే విధంగా థ్రిల్ అవుతారని, వాళ్ళకూ గూస్ బంప్స్ వస్తాయని ఆశిస్తున్నాను. సినిమాలో అంత పవర్ ఉంది. దర్శకులు హరి, హరీష్ కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.
పురాణాల్లో యశోద…ఈ సినిమాలో యశోద ఇద్దరూ మహిళలే. ఇద్దరూ అమ్మలే. చాలా మందిని రక్షించారు. ప్రేక్షకులకు శ్రీ కృష్ణుడిని పెంచిన 'యశోద' గురించి తెలుసు. పురాణాలపై అందరికీ అవగాహన ఉంది. మా సినిమా చూసిన తర్వాత 'యశోద' క్యారెక్టర్ గురించి అర్థం అవుతుంది. నేను చెప్పే విషయాన్ని అందరూ అంగీకరిస్తారని నమ్మకం ఉంది.
ఇంతకు మించి కథ గురించి నేను ఇంకేమైనా చెప్పానంటే… సినిమా చూసేటప్పుడు థ్రిల్ మిస్ అవుతారు. 'యశోద' ఒక మంచి థ్రిల్లర్. థియేటర్లో చూసేటప్పుడు తర్వాత ఏం జరుగుతుందోనని కుర్చీ అంచుకు వచ్చేస్తారు. దర్శకులు కథ, స్క్రీన్ ప్లే రాసిన విధానం… స్క్రీన్ మీదకు తీసుకు వచ్చిన తీరు… ఫైట్స్, సెట్స్, ఆర్ట్ వర్క్, మ్యూజిక్… ప్రతిదీ సూపర్. తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన చిత్రమిది. వెండితెరపై ఎంజాయ్ చేయాలి.
సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్ కోసం లోకల్ హోటల్స్, హాస్పిటల్స్ చాలా చూశారు. కానీ, ఏవీ సెట్ కాలేదు. దాంతో భారీ సెట్ వేశారు. నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సినిమా గొప్పగా ఉండాలని ఎప్పుడూ తపిస్తారు. అవుట్‌పుట్ గ్రాండ్‌గా ఉండాలని ఖర్చుకు వెనుకాడకుండా తీశారు.
కథ చూస్తే… కథలో, సినిమాలో గొప్ప ఎమోషన్ ఉంది. ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా సినిమా ఉంటుందని అర్థమైంది. బిగినింగ్ నుంచి కథలో పొటెన్షియల్ ఉందని మాకు అర్థమైంది. షూటింగ్ చేసేటప్పుడు మా కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. ఎమోషనల్ పాయింట్ కావడంతో అన్ని భాషల ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని, అందరికీ నచ్చుతుందని అనుకున్నాం. ఇప్పుడు ఐదు భాషల్లో విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు, మీడియా 'పాన్ ఇండియా' అంటున్నారు. పాన్ ఇండియా హిట్ అవుతుందని ఆశిస్తున్నా.
'యశోద'కు డబ్బింగ్ చెప్పాలని ముందు నుంచి డిసైడ్ అయ్యాను. ఒక్కసారి నేను కమిట్ అయ్యానంటే… చేయాల్సిందే. ఓ క్యారెక్టర్ చేసేటప్పుడు ఆర్టిస్ట్ ప్రాణం పెట్టారంటే… వాళ్ళే డబ్బింగ్ చెప్పాలని కోరుకుంటారు. తమ వాయిస్ వినిపించాలని అనుకుంటారు. నేను ఇంతే… నాలో ఆ పట్టుదల ఉంది. నాకు మొండితనం ఎక్కువ. సవాళ్లు ఎదురైనప్పటికీ డబ్బింగ్ చెప్పగలిగినందుకు సంతోషంగా ఉంది.
నా అభిమానులు,వాళ్ళు చూపిస్తున్న ప్రేమ, అభిమానం, మద్దతుకు థాంక్స్. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను. ఇదొక యుద్ధం. ఆ యుద్ధంలో పోరాటం చేయడానికి మీరందరూ చూపిస్తున్న ప్రేమ, మద్దతే కారణం.