‘సిచుయేషన్ డిమాండ్ చేస్తే ఎంతవరకైనా వెళ్లవచ్చు’ననే సార్వజనీనమైన సిద్ధాంతం ఒకటి ఉంటుంది. చాలారంగాల్లో ఈ సిద్ధాంతానికి విలువ ఉంటుంది. రాజకీయాల్లో కూడా సిచుయేషన్ డిమాండ్ చేయడాన్ని బట్టి నాయకులు అవతలి వారిని తిట్టిపోయాలా? పొగడాలా? అనేది డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. మామూలుగా అయితే.. భాజపా మీద పైపై విమర్శలతోనే సరిపెట్టే కేటీఆర్.. ఇప్పుడు మునిసిపల్ ఎన్నికలు దగ్గర పడుతుండు సరికి.. గత అయిదేళ్లలో తెలంగాణకు ఏమీ చేయలేదంటూ నిప్పులు చెరుగుతున్నారు.
వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. పార్టీ కమిటీలను గేరప్ చేసి రంగంలోకి దించే పనిలో ఉన్నారు. ఎక్కడికక్కడ సోషల్ మీడియా టీమ్ లను కూడా యాక్టివేట్ చేస్తూ ఇప్పటికే పార్టీ అనుకూల ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకు వెళుతున్నారు. ఇన్ని రకాలుగా బహుముఖపాత్రలు నిర్వహిస్తున్న కేటీఆర్ తాజాగా.. కంటోన్మెంటు ఎన్నికలకు సంబంధించి… పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంలో భాగంగా భాజపా మీద విమర్శలే ప్రధానంగా ఎంచుతున్నట్లు కనిపిస్తోంది.
ఇందుకు సహేతుకమైన కారణం ఉంది. కంటోన్మెంటు అనేది సికింద్రాబాద్ ఎంపీ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఎమ్మెల్యే ఎన్నికల్లో కంటోన్మెంటులో కూడా గులాబీజెండా రెపరెపలాడినప్పటికీ.. ఎంపీ ఎన్నికలు వచ్చేసరికి సికింద్రాబాద్ లో కమలం గెలిచింది. అవి ఎంపీ ఎన్నికలు గనుక.. నేషనల్ పార్టీకి ఓటు వేసి ఉంటారనుకుంటే పర్లేదు గానీ.. జనాభిప్రాయమే భాజపాకు అనుకూలంగా మారిఉంటే గనుక.. సీరియస్ గా పరిగణించాల్సిందే. అందుకే కేటీఆర్ చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టే ప్రయత్నంలో ఉన్నారు.
కంటోన్మెంటు ఎన్నికలకు సంబంధించి.. అక్కడి ఓట్లు తెలంగాణలో బలపడుతున్న భాజపాకు పడకుండా కేటీఆర్ జాగ్రత్త తీసుకుంటున్నారు. అయిదేళ్లలో కేంద్రం రాష్ట్రానికి ఏమీ సాయం చేయలేదని, ద్రోహం చేసిందని అంటూ.. రక్షణశాఖకు చెందిన స్థలాలను ఇవ్వకుండా జనజీవితాలకు ఎదురవుతున్న కష్టాలను తీర్చేయడానికి తాము చేసే ప్రయత్నాలను అడ్డుకుంటున్నదని పితూరీలు చెబుతున్నారు. రక్షణశాఖ స్థలాలు ఇచ్చి ఉంటే స్కైవేలు కట్టేసి.. ప్రజలకు ఎంతో మేలుచేసేసి ఉండేవారమని అంటున్నారు.
ఇదంతా కంటోన్మెంట్ ఎన్నికల సిచుయేషన్ చేసే డిమాండ్ ను బట్టి కేటీఆర్ మాటలే గానీ.. ఎన్నికల తర్వాత ఈ సమస్యలపై ఇంత ఫోకస్ ఉంటుందా? అని ప్రజలు అనుకుంటున్నారు.