బాలయ్యకు గెటప్స్ కొత్తకాదు. ఎవరేం అనుకున్నప్పటికీ తను అనుకున్న గెటప్ లోకి మారిపోతాడు. విమర్శల్ని అస్సలు పట్టించుకోడు. తాజాగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమా కోసం ఐరన్ మేన్ టోనీ స్టార్క్ గెటప్ లోకి మారాడు. గెడ్డం, హెయిర్ స్టయిల్ విభిన్నంగా కత్తిరించుకున్నాడు. ఈ మేకోవర్ చూసి చాలామంది నవ్వుకున్నారు. మరికొంతమంది మెచ్చుకున్నారు.
అయితే తన పని ఇంతటితో పూర్తవ్వలేదంటున్నాడు బాలయ్య. సినిమాలో మరో విభిన్నమైన గెటప్ ఉందట. ఆ గెటప్ ను కూడా త్వరలోనే విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. సినిమాలో ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో భూమికతో కలిసి కనిపించబోతున్నాడు బాలయ్య. దీనికోసం మరో గెటప్ ను సిద్ధంచేసి పెట్టారు.
ఇలా ప్రతి సినిమాలో రెండు షేడ్స్ లో కనిపించడం బాలయ్యకు అలవాటే. సమరసింహారెడ్డి నుంచి బాలయ్యకు ఇలా డిఫరెంట్ షేడ్స్ లో కనిపించడం అలవాటైంది. ఇప్పుడు కేఎస్ రవికుమార్ సినిమా కోసం కూడా మరోసారి ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాడు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు.
ఇవాళ్టి నుంచి ఈ సినిమా రెండో షెడ్యూల్ రామోజీ ఫిలింసిటీలో మొదలుకానుంది. బాలయ్య, భూమిక మధ్య కొన్ని సన్నివేశాలు తీయబోతున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత బాలయ్య రెండో అవతారం బయటకొచ్చే అవకాశం ఉంది. సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు.