మొబైల్ రంగాన్ని ఇప్పటికే ఓ కుదుపు కుదిపేసింది జియో. దాని దెబ్బకు ఆ రంగంలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. ఇతర సంస్థలన్నీ భారీ రేట్లు తగ్గించుకోవడం తో పాటు ఐడియా-వోడాఫోన్ విలీనానికి కూడా కారణమైంది జియో. అలా మొబైల్ రంగంలో పెను సంచలనాలకు నాంది పలికిన జియో, ఇప్పుడు ఇంటర్నెట్, టీవీ సర్వీసులపై దృష్టి పెట్టింది. మరికొన్ని గంటల్లో జియో బ్రాండ్ బ్యాండ్ సేవలు అధికారికంగా ప్రారంభం కాబోతున్నాయి.
ఇప్పటికే కోట్లాది మొబైల్ వినియోగదారుల్ని ఆకర్షించిన జియో, ఇప్పుడు డీటీహెచ్, కేబుల్ టీవీ కస్టమర్లను తమవైపు తిప్పుకునే ప్రణాళికతో ముందుకొచ్చింది. అదే జియో ఫైబర్. ఇవాళ్టి నుంచి ప్రారంభంకానున్న ఈ సేవల్లో కాంప్లిమెంటరీ ఆఫర్ కింద వినియోగదారులందరికీ సెట్ బాక్స్ అందించబోతోంది జియో. ఏడాది సబ్-స్క్రిషన్ తీసుకున్న కస్టమర్లకు ఏకంగా హెచ్ డీ టీవీ లేదా 4కే సెట్ టాప్ బాక్స్ ను ఉచితంగా అందిస్తోంది.
వినోదం, వీడియో కాలింగ్, ఇంటర్నెట్, కాలింగ్ సదుపాయాలు అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది జియో ఫైబర్. ఈ ప్లాన్ లో భాగంగా ల్యాండ్ లైన్ నుంచి జీవిత కాలం ఉచిత కాలింగ్ సౌకర్యం కల్పిస్తుంది. అటు ఇంటర్నెట్ సేవల్లో భాగంగా సెకెనుకు 100 మెగాబిట్ నుంచి 1 గిగా బైట్ స్పీడ్ వరకు ఇంటర్నెట్ ను అందించబోతోంది. అంతేకాదు.. హాట్ స్టార్, జీ5, నెట్ ఫ్లిక్స్ లాంటి సేవల్ని కూడా ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి జియో ఫైబర్ ప్లాన్ లో అంతర్భాగంగా అందిస్తున్నారు. ఈ సేవలన్నీ 700 రూపాయల నుంచి ప్రారంభం కాబోతున్నాయి.
జియో ఫైబర్ రాకతో డైరక్ట్ టు హోమ్ సేవలందించే సంస్థలన్నీ అప్రమత్తమయ్యాయి. నార్త్ లో డిష్ టీవీ, దక్షిణాదిన సన్-డైరక్ట్ డీటీహెచ్ కు మంచి ఆదరణ ఉంది. ఇవన్నీ ఇప్పుడు తమ ప్లాన్స్ ను మార్చడంతో పాటు.. టారిఫ్స్ కూడా తగ్గించే ఆలోచనలో ఉన్నాయి. మొబైల్ రంగంలో జియో దెబ్బ చవిచూసిన ఎయిర్ టెల్, ఫైబర్ రంగంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉంది. అందరికంటే ముందుగా డీటీహెచ్ రేట్లు తగ్గించింది. డీటీహెచ్ రంగంలో జియో ఫైబర్ ఎలాంటి సంచలనాలకు తెరతీయబోతుందో మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది.