కోర్టు గడప తొక్కిన పోర్టు గొడవ

కాంట్రాక్టరు సంస్థ నవయుగ అంతకంతకూ ప్రభుత్వంతో సున్నం పెట్టుకునే ధోరణిలోనే సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులను రద్దుచేసిన వ్యవహారంలో ఇదివరకే కోర్టును ఆశ్రయించి పిటిషన్ నడుపుతున్న నవయుగ, తాజాగా బందరు పోర్టు నిర్మాణం…

కాంట్రాక్టరు సంస్థ నవయుగ అంతకంతకూ ప్రభుత్వంతో సున్నం పెట్టుకునే ధోరణిలోనే సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులను రద్దుచేసిన వ్యవహారంలో ఇదివరకే కోర్టును ఆశ్రయించి పిటిషన్ నడుపుతున్న నవయుగ, తాజాగా బందరు పోర్టు నిర్మాణం నుంచి తమ సంస్థతో కాంట్రాక్టును రద్దు చేసుకోవడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనికి సంబంధించిన జీవోను రద్దు చేయాలని హైకోర్టుకు విన్నవించింది.

అటు పోలవరం, ఇటు బందరు పోర్టు పనుల్లో మౌలికంగా కాంట్రాక్టరు నవయుగ వారే అయినప్పటికీ.. ఈ రెండు వ్యవహారాలు, దావాల్లో కొంత తేడా ఉంది. పోలవరం ప్రధాన డ్యామ్ నిర్మాణం ఇప్పటికే కొంతభాగం వారు పూర్తిచేశారు. ఆ టెండరును నామినేషన్ తరహాలోనే దక్కించుకున్నప్పటికీ.. పాత కాంట్రాక్టరుతో ప్రభుత్వం పూర్తిగా విసిగిపోయిన తర్వాత.. 2700 కోట్ల రూపాయల అదనపు భారానికి సిద్ధపడి కొత్తగా టెండర్లు పిలవాలని ప్రభుత్వం అనుకుంటున్న తరుణంలో.. నవయుగ సంస్థ పాత ధరలకే పనిచేయడానికి ఒప్పుకుని అందులో ప్రవేశించింది.

వారి ఆధ్వర్యంలో ప్రధాన డ్యామ్‌కు సంబంధించిన పనులు కొంత చురుగ్గానే జరిగాయి. హైడల్ ప్రాజెక్టు పనులు మాత్రం మొదలుకాలేదు. ఆ రెండూ కూడా రద్దయిపోవడంతో.. నవయుగ హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దును సవాలు చేస్తూ కోర్టును ఆశ్రియించింది. మధ్యంతర ఉత్తర్వులు వచ్చినా ఇంకా విచారణ నడుస్తోంది. ఇదిలా ఉండగానే.. ఆ రద్దు ఉత్తర్వులను కేబినెట్ కూడా ఆమోదించేసింది. అయితే బందరు పోర్టు పరిస్థితి పూర్తిగా వేరు. కొన్ని సంవత్సరాలుగా.. స్థలాలను ప్రభుత్వం వద్ద నుంచి పుచ్చుకున్నప్పటికీ.. నిర్మాణ సంస్థ కాలయాపన చేస్తున్నదే తప్ప.. పనులు ప్రారంభించడం లేదని ఆరోపణలున్నాయి.

వీరి కాలయాపనతో జగన్ ప్రభుత్వం పూర్తిగా విసిగిపోయింది. తెదేపా హయాంలో మాదిరిగా తాము ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగడం కుదరదని స్పష్టం చేయదలచుకుంది. ఆ నేపథ్యంలోనే వారి కాంట్రాక్టులు రద్దయ్యాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత.. 25 శాతం పూర్తికాని అన్ని కాంట్రాక్టులనూ రద్దుచేసేసిన జగన్.. నామమాత్రంగా కూడా మొదలుకాని పోర్టు కాంట్రాక్టును కూడా రద్దుచేశారు. పోర్టు నిర్మాణం అవసరమైతే ప్రభుత్వమే చేపడుతుందని కూడా జగన్ సర్కారు ప్రకటించింది.

సుమారు ఇరవైరోజులకు పైగా వ్యవధి తీసుకుని.. ఇప్పుడు తమ కాంట్రాక్టును రద్దు చేయడం చట్టవిరుద్ధమంటూ నవయుగ కోర్టును ఆశ్రయించడం విశేషం. కాంట్రాక్టుల విషయంలో ప్రభుత్వాలకు పూర్తి అధికారాలు ఉంటాయి. అయితే, తమకు ఇంకా నాలుగువేల ఎకరాల భూములు అప్పగించలేదని, వివరణ అడక్కుండా రద్దు చేశారని వారు పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే.. న్యాయపీఠం ముందు ఎవరి వాదన నెగ్గుతుందో వేచిచూడాలి.

సాహోపై సీనియర్ జర్నలిస్ట్ ఏమన్నారంటే..?