ఇటీవలి కాలంలో ఒక నాయకుడు సెలవిచ్చారు… ‘ఇది రాజకీయ పునరేకీకరణల సమయం’ అని! అవును మరి.. ఒక పార్టీలోంచి మరో పార్టీలోకి తమ ఇష్టానుసారంగా మారిపోతూ ఉండే జంపింగ్ జపాంగ్ లు ఆ ప్రక్రియకు పెట్టుకునే ముద్దుపేరు రాజకీయ పునరేకీకరణ. బలహీనంగా ఉన్న లేదా, ఇటీవలి ఎన్నికల్లో బలం నిరూపించుకోలేకపోయిన పార్టీల్లో చేరే వారు తక్కువగానే ఉంటారు. కానీ.. లోక్‌సత్తా అధికార ప్రతినిధిగా ఉన్న ఒక నాయకుడు పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలో చేరడం మాత్రం విశేషమే.
సాధారణంగా నాయకులందరూ రాష్ట్రంలో గానీ, కేంద్రంలో గానీ అధికారంలో ఉన్న పార్టీలో చేరడానికి మాత్రమే ఉత్సాహం చూపిస్తుంటారు. కొన్ని బలవంతపు సందర్భాల్లో, ఉన్న పార్టీల్లో తమకిక ఠికానా లేదని గమనించిన సందర్భాల్లో అధికార పార్టీల్లోంచి ఇతర పార్టీల్లోకి కూడా వెళుతుంటారు. ఇటీవలి కాలంలో తెలుగుదేశానికి చాలామంది రాజీనామా చేస్తున్నారు. కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఒక నాయకుడు వచ్చి తమతో చేరగానే.. చంద్రబాబునాయుడు అదో అద్భుతంగా అభివర్ణించేసుకున్నారు.
ఇది పునరేకీకరణ అవునో కాదో గానీ.. కూసంపూడి శ్రీనివాస్ అనే రాజకీయ విశ్లేషకుడు తాజాగా జనసేన పార్టీలో చేరారు. ఆయన మొన్నటిదాకా అధికార ప్రతినిధిగా ఉన్న లోక్ సత్తా కంటె ఇది కాస్త మెరుగైన పార్టీ అనుకుని ఇటు వచ్చారేమో తెలియదు. ఇదే కూసంపూడి శ్రీనివాస్ కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి తరఫున 2014లో ఎమ్మెల్యేగా కూడా పోటీచేశారు. ఆ తర్వాత లోక్ సత్తాకు అనుబంధంగా ఉన్నారు. ఇప్పుడు జనసేనలో చేరారు.
అయితే ఆయన జనసేన పట్ల తన ప్రేమను కొన్నిరోజులుగా బయటపెడుతూనే ఉన్నారు. ఓడిపోయినా సరే.. పవన్ ప్రజల కోసం సాగిస్తున్న పోరాటాలను తన ట్విటర్ ఖాతాలో శ్లాఘిస్తున్నారు. పవన్ పుట్టినరోజు నాడు కూడా ఆయనను కీర్తించారు. ఇలా బహుధా దగ్గరైన తర్వాత.. పార్టీలో చేరడం అనే లాంఛనాన్ని బుధవారం పూర్తిచేశారు. ఈ రాజకీయ పునరేకీకరణలకు కులం అనేది ప్రాతిపదిక కానంతవరకు అన్నీ మంచివే.
మొత్తానికి శ్రీనివాస్ రూపంలో జనసేనకు టీవీ ఛానెళ్లలో మాట్లాడడానికి సరైన నాయకుడు దొరికాడనుకోవచ్చు. ఎందుకంటే.. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నవారంతా.. టీవీ ఛానెళ్ల చర్చా కార్యక్రమాలకు మించిన ఇమేజి ఉన్నవారే మరి!!