గురుపూజ : నాకు వాళ్లంటే అసూయ…

గురువులంటే నాకు అసూయ. ఎత్తులకు ఎదిగిపోయే వ్యక్తుల జీవితాల్లో.. ఒక చిన్న పుటగానో, అధ్యాయంగానో ఒదిగిపోయి వారు శాశ్వతత్వాన్ని ఆపాదించుకుని అలరారుతుంటారని జలన్! అమ్మని మరచిపోని ప్రతి మనిషీ.. జీవితంలో ఏదో ఒక సందర్భంలో…

గురువులంటే నాకు అసూయ. ఎత్తులకు ఎదిగిపోయే వ్యక్తుల జీవితాల్లో.. ఒక చిన్న పుటగానో, అధ్యాయంగానో ఒదిగిపోయి వారు శాశ్వతత్వాన్ని ఆపాదించుకుని అలరారుతుంటారని జలన్! అమ్మని మరచిపోని ప్రతి మనిషీ.. జీవితంలో ఏదో ఒక సందర్భంలో వారితో అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ, స్మృతులతో తాదాత్మ్యం చెందుతుంటారని తెలిసి, నాలో నేనే భరించలేనంత జెలసీ!!

నేను ఎంచుకున్న జీవనమార్గం ఆ అసూయకంటె- ఎక్కువ ఇష్టమైనది, ప్రేమించేది కాకపోయినట్లయితే.. ఎప్పుడో  ఆ జ్వాలల్లో భస్మమైపోయి ఉండేవాడిని. అయితే ఏవో కొన్ని పరిమిత సందర్భాల్లో- కొన్ని ప్రెవేటు కాలేజీల్లో, అధికారులకు పునశ్చరణ తరగతుల్లో, యూనివర్సిటీ దూరవిద్య తరగతుల్లో, అక్షరం నేర్వగల ప్రక్రియల రూపకల్పనలో అన్నింటినీ మించి.. పల్లెలో తెలుగు అక్షరాలు గుర్తించలేని ఆరోతరగతి పొరుగింటి పాపని అంతోఇంతో చదివేలా తీర్చిదిద్దడంలో.. సంతృప్తి వెతుక్కుంటూ,  నన్ను దహించే అసూయ జ్వాలలను ఉపశమింపజేస్తుంటాను.

ఏడాదికోసారి తలచుకునే ఏతత్ దినోత్సవాలంటే నాకు పెద్ద మోజు లేదు. కానీ ఆ పేరిట ఒక రోజంతా తత్ సంబంధిత జ్ఞాపకాలను తవ్వుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. గురుపూజోత్సవం నాడు ఏ జ్ఞాపకాలను తవ్వుకోవాలి? సముద్రంలోంచి ఏ నీటి చుక్కను ఏరుకోవాలంటే ఏం చెబుతాం!! పాలు తాగడం నేర్పిన అమ్మ నుంచి.. ఆఖరిశ్వాస దాకా.. అందరూ గురువులే. బతుకులో వేసే ప్రతి అడుగూ ఒక పాఠం అయితే… తారసిల్లే ప్రతిఒక్కరూ గురువే. వారినుంచి మనం ఏం నేర్చుకున్నాం.. జీవన సాఫల్యానికి ఎంతగా ఉపయోగించుకున్నాం.. అనేది మాత్రమే స్థాయీ భేదం. బతుకును ‘ఇలా’ తీర్చిన వారిని పేర్ల ప్రస్తావనతో సమగ్రంగా స్మరించుకోగలగడం తాహతుకు మించిన సాహసం.

అడుగులు వేస్తూ ఉంటేనే పాఠాలు నేర్చేది!

మనుషుల్లో మెదలుతుంటేనే గురువులు దొరికేది!

నిర్వ్యాపారత్వం మృత్యులక్షణం. పాఠాలూ నేర్వం, గురువులూ దొరకరు.

‘పొద్దుచాలని మనిషి’ లాగా పరుగెత్తుతూ..నే ఉండాలి.

పడి పడి లేస్తూ ఉంటే..

పడిన ప్రతిసారీ కొత్త పాఠం నేరుస్తూ ఉంటే

గురు బలం పెరుగుతుంటుంది.

==

జగతిలో- గురువులందరికీ శుభాకాంక్షలు.

బతుకులో- గురువులందరికీ శిరఃప్రణామాలు.

‘‘యో… అంతర్ జ్యోతిరేవ యః’’

తనయందలి జ్ఞానప్రకాశాన్ని ఎవడైతే పొందగలుగుతాడో… వాడు యోగి అని కర్మసన్యాసయోగంలో నిర్వచిస్తాడు గీతాకారుడైన జగద్గురువు శ్రీకృష్ణుడు. తనకు తానే గురువు కాగలవాడు.. యోగి అనేది దీని భావం కావొచ్చు. తన అజ్ఞానాన్ని తాను తెలుసుకోవడమే అందుకు మార్గం కావొచ్చు. తన జీవితంలోని వేవేల గురువులకు, తానూ ఒకడుగా జత కలవగలిగితే ప్రతివాడూ ధన్యుడు.

అందరికీ గురుపూజోత్సవ శుభకామనలు.

-సురేష్ పిళ్లె