వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే ప్రజలకు ఎందుకంత అభిమానం అని కొందరికి సందేహం కలుగుతుండవచ్చు. అది తెలియడానికి మచ్చుకు ఓ సంఘటన గుర్తు చేసుకుందాం. వైఎస్సార్ సీఎం అయి నెలలు గడిచాయి. మునిసిపల్ శాఖ సమీక్ష సమావేశం ఏర్పాటైంది. అప్పటికే మునిసిపల్ పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచుతాం అని ఆయన ఎన్నికల ప్రచారంలోనే హామీ ఇచ్చారు. ఆ పాయింటే ఆ సమావేశానికి ఎజెండా. అధికారులంతా సమావేశంలో కూర్చున్నాక… తన ఛాంబర్ లోంచి వైఎస్ వచ్చారు. అప్పటిదాకా చంద్రబాబు పాలనలో అలవాటైన తీరును బట్టి.. సంబంధిత శాఖ ఉన్నతాధికారి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మునిసిపల్ శాఖ పురోగతిని ఏకరవు పెట్టడం ప్రారంభించారు.
‘అమ్మా అదంతా వొద్దు.. మనం పారిశుధ్య కార్మికులకు జీతాలు పెంచుతాం అని చెప్పాం.. ఆ సంగతి చెప్పండి’ అన్నారు వైఎస్. ఆమె నీళ్లు నమిలారు. ‘అంటే చాలా బర్డెన్ అవుతుంది సార్.. ఎలాగంటే..’ అంటూ లెక్కలు బయటకు తీయబోయారు. ఎన్ని వందల కోట్ల భారం ప్రభుత్వంపై పెరగుతుందో చెప్పాలని అనుకున్నారు. వైఎస్.. ఆమెను నిలువరించి.. ‘మనం ఏప్రిల్ నుంచి జీతాలు పెంచుతాం అని వాళ్లకు చెప్పాం.. అలా పెంచుతున్నట్లుగా జీవో తయారుచేసి తీసుకురండి..’ అని ఒకేమాటతో ముగించేసి.. సమావేశంలోంచి లేచి.. తన చాంబర్‌కు వెళ్లిపోయారు.
సంక్షేమానికి సంబంధించి గానీ, ఇచ్చినమాట నిలబెట్టుకోవడంలో గానీ.. వైఎస్సార్ శైలి అది. ఇప్పుడు బుధవారం నాడు మంత్రులతో సమావేశంలో జగన్మోహనరెడ్డి తీరు గమనిస్తే అదే గుర్తుకు వస్తోంది. తాము హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలను వెంటవెంటనే కాకుండా.. కాస్త గ్యాప్ ఇచ్చి ఆచరణలోకి తెస్తూ ఉంటే ప్రభుత్వానికి ఎక్కువ మైలేజీ వస్తుందంటూ కొందరు మంత్రులు సూచనలు చేశారు. అన్ని పథకాలూ ఒకేసారి అమలు చేయడం వలన కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతగా సహకరించకపోవచ్చునని కూడా కొందరు మంత్రులు వ్యాఖ్యానించారు.
అయితే జగన్ ఇలాంటి సలహాలను ఏమాత్రం పట్టించుకోకపోవడం విశేషం. ‘ఇస్తాం అని చెప్పాం.. వెంటనే అన్నీ ఇవ్వాల్సిందే’ అంటూ జగన్ తేల్చి చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆర్థిక భారాన్ని కూడా ఖాతరు చేయకుండా.. మాట నిలబెట్టుకోవడం మీదనే.. ఆయన దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఆ రకంగా వాగ్ధానాలను అమలు చేసే విషయంలో జగన్మోహన రెడ్డి తన తండ్రి వైఎస్సార్ ను గుర్తుకు తెస్తున్నారు.