నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ. మూడేళ్లుగా ఇదిగో అదిగో సినిమా అంటూ వినిపిస్తూ రావమడే తప్ప, కార్యరూపం దాల్చలేదు. ఈలోగా అనేకానేక గ్యాసిప్ లు. మోక్షజ్ఞ బాగా లావు అయ్యాడని, తగ్గుతున్నాడని, సైకాలజికల్ గా డిస్ట్రబ్ అయ్యాడని, నలుగురిలోకి రావడం అంతగా ఇష్టపడడం లేదని, ఇలా ఒకటికాదు, రెండు కాదు. చాలా గ్యాసిప్ లు.
దానికి తగినట్లే ఏ ఫంక్షన్ లో కానీ, ఈవెంట్ లో కానీ మోక్షజ్ఞ వచ్చిన దాఖలాలు కానీ, కనిపించిన దాఖలాలు కానీ లేవు. అసలు మోక్షజ్ఞ లేటెస్ట్ ఫొటో అన్నదేలేదు. నందమూరి వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే మిగిలిపోయేలా వుంది పరిస్థితి. బాలయ్య తరువాత మరి ఎవరు అంటే ఎవ్వరూ లేరు. ఎన్టీఆర్ మాత్రమే మిగిలాడు.
బాలయ్య కూడా కొడుకును సినిమాల్లోకి తీసుకువచ్చే విషయం సీరియస్ గా తీసుకున్నట్లు లేదు. తీసుకుని వుంటే, కొడుకును అన్నివిధాలా రెడీ చేసి, స్క్రీన్ ముందుకు ఇప్పటికే తెచ్చేవారే. బాలయ్య తన కెరీర్ మీదనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో మోక్షజ్ఞ బర్త్ డే వచ్చింది. ఈ మధ్యన కొత్తగా వచ్చిన ట్రెండ్ ప్రకారం ట్విట్టర్ లో ఓ కామన్ డీపీ, కామన్ హ్యాష్ టాగ్ వదలడం, వాటిని పట్టుకుని ట్రెండ్ చేయడం, అన్నది ఫ్యాన్స్ కు అలవాటుగా మారింది.
మోక్షజ్ఞ కోసం అలాగే ఓ కామన్ డీపీ వదిలారు. కానీ ఆ డీపీలో వున్నవి అరిగిపోయిన పాత ఫొటోలే. ఎప్పడో ఏళ్లక్రితం నాటివి. కొత్త వాసన మచ్చుకైనా లేదు. మరి ఎందుకు మోక్షజ్ఞ కొత్త ఫొటోలు అన్నవి వదలడం లేదో? నందమూరి ఫ్యామిలీకే తెలియాలి.