అమల్లో ఉన్న పాలసీని ఆపేసి, ఇసుక సరఫరా లేకుండా చేశారని.. దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయిందని చంద్రబాబు అండ్ కో నిన్నటివరకు దుష్ప్రచారం చేసింది. ఆర్థికమాంద్యం వల్ల రియల్ ఎస్టేట్ పడిందనే విషయం అందరికీ తెలిసినప్పటికీ దానికి ఇసుక పాలసీని లింక్ చేస్తూ, బాబు లేనిపోని విమర్శలు చేశారు. అయితే శాండ్ పాలసీ ఎందుకు ఆలస్యమైందనే విషయంపై ఇప్పుడు అందరికీ ఓ అవగాహన వచ్చింది. ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చిన ఇసుక పాలసీ అత్యంత పకడ్బందీగా ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా 102 ఇసుక రీచ్ ల్ని అధికారికంగా గుర్తించింది జగన్ సర్కార్. ఈ రీచ్ ల నుంచి మాత్రమే ఇసుకను తరలించాల్సి ఉంది. ఇసుక టన్ను ధరను 375 రూపాయలుగా నిర్ణయించారు. దీనికి రవాణా ఖర్చులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ అమ్మకాలన్నీ ఏపీఎండీసీ ద్వారా జరుగుతాయి. ఇసుక కావాలనుకునేవాళ్లు సంబంధిత వెబ్ సైట్ లేదా మీసేవా కేంద్రాల ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఏపీఎండీసీ వాటిని సరఫరా చేస్తోంది. రవాణా విషయంలో కూడా ప్రత్యేక నిఘాను ఏర్పాటుచేసింది ప్రభుత్వం.
జీవీఎస్ అనుసంధానమై ఉన్న వాహనాల్ని మాత్రమే అనుమతిస్తోంది. జీపీఎస్ లేకుండా ఇసుకను తరలిస్తే భారీగా జరిమానా విధిస్తారు. 10 కిలోమీటర్ల లోపు పరిథిలో ఇసుకను రవాణా చేయాలనుకునే చోట్లకు ట్రాక్టర్లను కూడా అనుమతిస్తారు. ప్రతి ఇసుక రీచ్ లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఇకపై ఇసుక బోర్డర్ దాటదు. రాష్ట్ర అవసరాల కోసం మాత్రమే ఇసుకను వినియోగించాలని పొరుగు రాష్ట్రాలకు తరలించడం నేరమని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు కలెక్టర్లకు విస్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ఎలాంటి అవినీతికి తావులేకుండా పూర్తిగా ఆన్ లైన్ ద్వారా లావాదేవీలు జరుపుతారు.
నదీగర్భం నుంచి ఇసుకను తవ్వేందుకు యంత్రాల్ని వాడకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. మానవ వనరుల్ని మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించింది. ఇలా చేయడం వల్ల కొంతమంది ఉపాధి కల్పించినట్టవుతుంది. నదీగర్భం కోతను కూడా ఉన్నంతలో అరికట్టినట్టవుతుంది. ఇప్పటివరకు 41 స్టాక్ పాయింట్స్ ఏర్పాటుచేసిన ప్రభుత్వం.. అక్టోబర్ నాటికి మరిన్ని స్టాక్ పాయింట్స్ పెంచుతామని ప్రకటించింది. మొత్తమ్మీద సరికొత్త ఇసుక పాలసీ రావడంతో వినియోగదారుల ఇసుక కష్టాలు తీరాయి. దళారుల ప్రమేయం పూర్తిగా తగ్గినట్టయింది.