అక్కినేని నాగచైతన్య.. మొత్తానికి సినిమా రంగానికి వచ్చి పదేళ్లు పూర్తి చేసుకున్నాడు. కానీ వెనుక చూసుకుంటే 13 ఫ్లాపులు. వీటిలో అరివీర భయంకర డిజాస్టర్లు గట్టిగానే వున్నాయి. తొలి సినిమా జోష్ తో పరాజయాల బోణీ ప్రారంభమైంది. ఏమాయ చేసావె, 100% లవ్ ఓకె అనుకుంటే దడ, బెజవాడ వచ్చి పలకరించారు. ఆ తరువాత తడాఖా ఓకె. మనం మంచి సినిమాగా మిగిలింది.
కానీ అంతలోనే ఆటోనగర్ సూర్య, ఒకలైలా కోసం, దోచేయ్ వచ్చాయి. వీటిలో ఆటోనగర్, దోచేయ్ సినిమాలు కళాఖండాలుగా మిగిలిపోయాయి. ప్రేమమ్ సినిమా ఊరట ఇచ్చింది అనుకునేలోగా, సాహసం శ్వాసగా సాగిపో అంటూ మళ్లీ ప్లాపు రెడీ. రారండోయ్ వేడుక చూద్దాం అంటూ హిట్ కొట్టగానే యుద్ధం శరణం అంటూ డిజాస్టర్ పలకరింపు.
శైలజరెడ్డి అల్లుడు యావరేజ్ అనుకంటుంటే, సవ్యసాచి అంటూ డిజాస్టర్ తోడు వచ్చింది. ఆ తరువాత మజిలీతో మళ్లీ ఊరట. ఇదీ నాగచైతన్య కెరీర్ గ్రాఫ్.
ఏం తెలిసింది..
ఈ ఫ్లాపులు, హిట్ ల కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక విషయం అర్థం అవుతుంది. నాగచైతన్యకు మాస్ సినిమాలు, యాక్షన్ జోనర్లు అస్సలు పనికిరావు. చక్కగా ఫ్యామిలీ టచ్ వున్న సినిమాలు చేసుకుంటే కనీసం యావరేజ్ అని అయినా అనిపించుకుంటాయి. కానీ సమస్య ఏమిటంటే, యాక్షన్ డ్రామా కథ చెబితేచాలు చైతన్య ఎగ్జయిట్ అయిపోతాడని ఇండస్ట్రీ టాక్. మాస్ యాక్షన్ హీరో అనిపించుకోవాలని చైతూ తాపత్రయం. కానీ జనాలు మాత్రం చైతూ కేరాఫ్ ఫ్యామిలీ సినిమా అంటున్నారు.
మరి పదేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న తరువాత ఇకపై రాబోయే సినిమాలు ఎలా వుంటాయో చూడాలి.