కంగారు అక్కర్లేదు. ఇది చింతకాయల సన్యాసినాయుడు గురించి కాదు. ఆ వికెట్ నర్సీపట్నం టూర్లోని లోకేష్ తన ఖాతాలో వేసుకున్నారు. ఇది చంద్రబాబునాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీపై కొత్తగా పెంచిన ఫోకస్ ప్రభావం. ఏపీ రాజకీయాల్లో ఇక తనకు పెద్దగా పనిలేకుండాపోయిన తర్వాత.. చంద్రబాబునాయుడు వీకెండ్స్ హైదరాబాదులో కుటుంబం సహా గడపడానికి వ్యూహాత్మక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. తెలంగాణలో కూడా పార్టీకి మళ్లీ పూర్వవైభవం తీసుకువస్తా.. ఇక మీద రెగ్యులర్‌గా సమీక్ష సమావేశాలు పెడతా, టూర్లు చేస్తా అంటూ ఆయన ఇటీవల ప్రకటించారు.
కొన్ని వారాలైనా గడవలేదు. అప్పుడే.. తెతెదేపా సీనియర్ నాయకుల్లో ఒకరైన రేవూరి ప్రకాశ్ రెడ్డి పార్టీని వీడిపోయారు. ఆయన తాజాగా కేంద్రమంత్రి జెపినడ్డా సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి, తెరాసకు చెందిన వరంగల్ మాజీఎంపీ రవీంద్ర నాయక్ ఇద్దరూ ఢిల్లీలో భాజపాలో చేరిపోయారు. అనంతరం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నడ్డాను కూడా కలిశారు.
కమలదళంలోకి వలసల పర్వంలో ఇది తాజా అధ్యాయం. గతంలోనూ తెలంగాణకు చెందిన పలువురు తెలుగుదేశం నాయకులు భాజపాలో చేరిపోయారు. వారిలో చంద్రబాబుకు ఆప్తుడుగా పేరున్న రాజ్యసభ ఎంపీ గరికపాటి మోహనరావు కూడా ఉన్నారు. వారంతా కలిసి హైదరాబాదులో ఓ భారీ సభ నిర్వహించి.. తెలంగాణలో తెలుగుదేశం పని అయిపోయిందని.. ఆ పార్టీలో ఇక ఎవరూ మిగల్లేదని తేల్చి చెప్పేశారు కూడా. ఈలోగా చంద్రబాబునాయుడు తెలంగాణ పార్టీ మీద ఫోకస్ పెంచారు.
పరాజయాలు పార్టీకి కొత్త కాదని.. మళ్లీ నిలదొక్కుకుంటామని ఆయన కార్యకర్తలకు చెప్పడానికి ప్రయత్నించారు. ఎంపీ నియోజకవర్గాల వారీగా వరుస సమీక్షలు ఉంటాయిన అన్నారు గానీ.. ఇప్పటిదాకా పార్టీకి అంతోఇంతో ఠికానా ఉన్న ఖమ్మంజిల్లా ఒక ప్రాంతపు కార్యకర్తలతో మినహా మరో సమావేశం జరగలేదు. చంద్రబాబు తనంత తాను ఫోకస్ పెంచుతూనే ఉన్నా.. తెతెదేపా బలహీనతలు బయటపడుతూనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో పార్టీలో ఎంతో సీనియర్ అయిన రేవూరి ప్రకాశ్ రెడ్డి కూడా పార్టీని వీడిపోవడం విశేషం.