చోద్యం చూస్తున్న సినీ ప్ర‌ముఖులు!

ఏపీ ప్ర‌భుత్వం ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు అమ్మాల‌నే ఆలోచ‌న‌పై తీవ్ర వివాదం నెల‌కుంది. సినిమా రంగానికి లేని బాధ, ఆవేద‌న‌ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ, ఎల్లో మీడియాలో విప‌రీతంగా క‌నిపిస్తున్నాయి. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏకంగా…

ఏపీ ప్ర‌భుత్వం ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు అమ్మాల‌నే ఆలోచ‌న‌పై తీవ్ర వివాదం నెల‌కుంది. సినిమా రంగానికి లేని బాధ, ఆవేద‌న‌ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ, ఎల్లో మీడియాలో విప‌రీతంగా క‌నిపిస్తున్నాయి. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏకంగా టాలీవుడ్‌లో అగ్ర‌శ్రేణి హీరో. అప్పుడ‌ప్పుడు ఇత‌రేత‌ర స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీసే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, త‌న మాతృ రంగానికి చెందిన అంశంపై నోరు మెద‌ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఈ వివాదంపై మంత్రి పేర్ని నాని మీడియా స‌మావేశంలో చెప్పిన అంశాలు ప‌లు అనుమానాల‌ను రేకెత్తిస్తున్నాయి. మంత్రి పేర్ని నాని ఏమ‌న్నారో ఆయ‌న మాట‌ల్లోనే…

“ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు అమ్మాలని సినీ ప్రముఖులే కోరారు. సినీ పెద్దల సూచనలే ప్రభుత్వం పరిశీలించింది. ఈ అంశంపై కమిటీలు వేశాం. అధ్యయనం జరుగుతోంది. సినిమా టికెట్లను ప్రభుత్వమే అమ్మాలనే విషయంపై ఇంత వరకూ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు” అని మంత్రి పేర్ని నాని స్ప‌ష్టం చేశారు.

సినీ ప్ర‌ముఖుల కోరిక మేర‌కు ప్ర‌భుత్వం సానుకూల నిర్ణ‌యం తీసుకుంద‌ని అర్థమ‌వుతోంది. అయితే త‌మ కోరిక‌ను మ‌న్నించి ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మ‌కాల‌పై ముంద‌డుగు వేసిన‌ జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని సినీ ప్ర‌ముఖులు స్వాగ‌తిస్తూ ఎందుకు ప్ర‌క‌ట‌న చేయ‌లేద‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. 

అలాగే ఆన్‌లైన్‌లో టికెట్ల అమ్మకాల విష‌య‌మై సంబంధం లేని వాళ్లు రాజ‌కీయ రాద్ధాంతం సృష్టిస్తుంటే… ఆ సినీ ప్ర‌ముఖులు ఎందుకు చోద్యం చూస్తున్నార‌ని నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కృత‌జ్ఞ‌త చెప్పాల్సిన బాధ్య‌త సినీ ప్ర‌ముఖుల‌పై లేదా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. తండ్లాట పెట్టి సినీ ప్ర‌ముఖులు త‌మాషా చూస్తున్నార‌నే భావ‌న‌ …పేర్ని నాని మాట‌ల్లో ధ్వ‌నిస్తోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.