సినీ రంగ సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో కలవాలని నిర్ణయించారు. అయితే అపాయింట్‌మెంట్ విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
కానీ ఈ నెల 20న సీఎంతో సినీ ప్రముఖుల భేటీ వుంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం లేదని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ప్రభుత్వానికి సంబంధం లేకుండా అపాయింట్‌మెంట్‌ను కొన్ని మీడియా సంస్థలే ఖరారు చేస్తున్నాయని మంత్రులు అభిప్రాయపడుతున్నారు.
ఇదంతా కుట్రపూరితంగా జరుగుతోందని ప్రభుత్వ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, ఈ నెల 20న చిరు నేతృత్వంలోని సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రి భేటీ కాకపోతే, సినీ రంగాన్ని అవమానపరిచారనే దుష్ప్రచారాన్ని చేసేందుకు కొన్ని శక్తులు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. వీలైనంత త్వరలో సినీ రంగంలోని వివిధ వర్గాల ప్రముఖులతో ముఖ్యమంత్రి జగన్ చర్చిస్తారని మంత్రి పేర్ని నాని ఇవాళ ప్రకటించారు.
త్వరలోనే సినీ పరిశ్రమ పెద్దలతో సమావేశమై వారి సలహాలు, సూచనలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతో త్వరలో భేటీ కానున్నట్టు నాని వెల్లడించారు. కానీ ఫలానా తేదీ అని ఆయన స్పష్టం చేయకపోవడాన్ని గమనించొచ్చు.
మొత్తానికి అపాయింట్‌మెంట్‌పై తేల్చి చెప్పకుండా జగన్ మాత్రం సినిమా వాళ్లకే సినిమా చూపిస్తున్నారనే సెటైర్స్ పేలుతున్నాయి.