నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు తెలంగాణ హైకోర్టు మొట్టికాయలు వేసింది. కోర్టుల విశ్వసనీయతను అనుమానించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులు ఇతర దేశాలకు వెళ్లడానికి అనుమతించినంత మాత్రాన కోర్టులనే అనుమానిస్తారా? అని న్యాయస్థానం నిలదీసింది.,
ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ , ఎంపీ విజయసాయిరెడ్డిల బెయిలు రద్దుచేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వడానికి ఒకరోజు ముందు ఎంపీ రఘురామకృష్ణంరాజు అనూహ్యంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రధాన సీబీఐ కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ హైకోర్టులో అత్యవసరంగా ఆయన పిటిషన్ వేయడం చర్చనీయాంశమైంది. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.శ్రీవెంకటేశ్ వాదనలు వినిపిస్తూ విజయసాయిరెడ్డి బెయిలు రద్దు పిటిషన్‌పై వాదనలు కొన సాగుతుండగా, జగన్ బెయిలును రద్దుచేయాలన్న పిటిషన్‌ను కోర్టు కొట్టేసిందంటూ సాక్షి వెబ్‌సైట్‌లో వార్తను క్యారీ చేశారన్నారు.
అలాగే విదేశీ పర్యటన కోసం విజయసాయిరెడ్డికి సీబీఐ కోర్టు అనుమతి మంజూరు చేసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసుల్లో పారదర్శకంగా విచారణ కొనసాగడం లేదని, నిందితులు కోరినట్టు రోజువారీ విచారణకు బదులు వాయిదా వేస్తుండడమే తమ అనుమానాలకు కారణాలుగా పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. అందువల్లే మరో కోర్టుకు బదిలీ చేయాలని గట్టిగా వాదించారు.
న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ విజయసాయిరెడ్డికి ఇచ్చిన అనుమతులపై హైకోర్టును ఆశ్రయించారా అని ప్రశ్నించారు. లేదని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పడంతో, అలాంటప్పుడు ఆ ఉత్తర్వుల ప్రస్తావన ఎందుకని నిలదీశారు.
కోర్టు నుంచి కేసు బదిలీ చేయాలంటే సరైన కారణాలు ఉండాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అవేవీ లేకుండానే ఈ కేసులో ఊహాజనిత కారణాలతో బదిలీ కోరుతూ, కోర్టులనే అనుమానిస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. రఘురామకృష్ణంరాజు పిటిషన్‌పై పౌర సమాజం కూడా ఇదే రకమైన అభిప్రాయాల్ని వ్యక్తం చేయడం విశేషం.