కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత రెడ్డెప్పగారిపల్లి రమేశ్‌కుమార్‌రెడ్డి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లో రమేశ్‌రెడ్డి కుటుంబానికి బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. రమేశ్‌రెడ్డి తండ్రి ఆర్.రాజగోపాల్‌రెడ్డి . ఈయన 1967,72లలో కాంగ్రెస్ తరపున లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1978లో జనతాపార్టీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
1983,85లలో టీడీపీ తరపున రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. 1989లో తిరిగి కాంగ్రెస్ తరపున గెలుపొందారు. 1994లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి రాజగోపాల్‌రెడ్డి ఓడిపోయారు. కడప జిల్లాలో వైఎస్సార్ వ్యతిరేక వర్గంగా రాజగోపాల్‌రెడ్డికి గుర్తింపు వుంది. అనంతరం వృద్ధాప్యం కారణంగా ఆయన రాజకీయాలకు దూరమయ్యారు.
రాజగోపాల్‌రెడ్డి రాజకీయ వారసులుగా ఆయన కుమారులు రమేశ్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాసులరెడ్డి వచ్చారు. 1999లో రమేశ్‌రెడ్డి లక్కిరెడ్డిపల్లె ఎమ్మెల్యేగా టీడీపీ తరపున గెలుపొందారు. ఆ తర్వాత ఎన్నికల్లో వరుస పోటీ తప్ప, గెలుపొందిన దాఖలాలు లేవు. రమేశ్‌రెడ్డి తమ్ముడు శ్రీనివాసులరెడ్డి కడప నుంచి వైఎస్ జగన్‌పై టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నిలిచి ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం ఆయన రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గంలోని పలు మండలాలు వేర్వేరు నియోజక వర్గాల్లో కలిసిపోయాయి. దీంతో రాయచోటి నియోజకవర్గం మిగిలింది. ఈ నేపథ్యంలో రాయచోటి నియోజకవర్గంలో టీడీపీలో పాలకొండ్రాయుడు, రాజగోపాల్‌రెడ్డి తనయుల మధ్య ఆధిపత్య పోరు నడిచింది. 2019లో రాయచోటి నుంచి రమేశ్‌రెడ్డికి టీడీపీ టికెట్ ఇచ్చింది. వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్‌రెడ్డిపై రమేశ్‌రెడ్డి ఓడిపోయారు. అప్పటి నుంచి రమేశ్‌రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.