దశాబ్దాల నాటి కల.. నెరవేరుతోంది ఇలా!

ఆర్టీసీ అంశం చుట్టూ ప్రభుత్వాలు ఆడిన డ్రామాలు ఇన్నీ అన్నీ కావు. మరీముఖ్యంగా గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు సర్కార్ ఆర్టీసీ ఉద్యోగులకు అరచేతిలో స్వర్గం చూపించింది. ఆ తర్వాత సింపుల్ గా హ్యాండ్ ఇచ్చింది.…

ఆర్టీసీ అంశం చుట్టూ ప్రభుత్వాలు ఆడిన డ్రామాలు ఇన్నీ అన్నీ కావు. మరీముఖ్యంగా గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు సర్కార్ ఆర్టీసీ ఉద్యోగులకు అరచేతిలో స్వర్గం చూపించింది. ఆ తర్వాత సింపుల్ గా హ్యాండ్ ఇచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి అస్సలు ఆసక్తి చూపించలేదు చంద్రబాబు. అలాంటిది జగన్ అధికారంలోకి వచ్చి 4 నెలలైనా కాకముందే ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయబోతున్నట్టు ప్రకటించారు. 

ఈరోజు జరిగిన కేబినెట్ భేటీలో ఆర్టీసీ విలీనానికి మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు ప్రజా రవాణా శాఖ ఏర్పాటుచేయాలని కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆర్టీసీ విలీనానికి సంబంధించి కమిటీ ఏర్పాటుచేశారు జగన్. తాజాగా కమిటీ తన నివేదికను సమర్పించింది. దాదాపు కమిటీ చెప్పిన అన్ని అంశాలను ఆమోదిస్తూ, విలీనానికి పచ్చజెండా ఊపారు. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఎలాంటి మెలికలు, కొర్రీలు పెట్టలేదు సీఎం. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే నియమనిబంధనలు, సౌకర్యాలన్నీ వర్తిస్తాయి. అంతేకాదు, ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును కూడా 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 330 కోట్ల రూపాయల భారం పడుతున్నప్పటికీ ఈ విషయంలో జగన్ వెనక్కి తగ్గలేదు. 

మరోవైపు విలీనం సందర్భంగా ప్రజలపై భారం పడుతుందనే ప్రతిపక్షాల వాదనలకు కూడా చెక్ పెట్టారు జగన్. బస్సు చార్జీల నియంత్రణకు, చార్జీల పెంపు కాకుండా ఇతర మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకునే అవకాశాల్ని పరిశీలించేందుకు కమిటీని వేయబోతున్నట్టు ప్రకటించారు. మొత్తమ్మీద జగన్ రాకతో ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల నాటి  కల చిటికెలో నెరవేరింది. వాళ్ల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.