నారా లోకేష్ మరోసారి సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులకి టార్గెట్ అయిపోయాడు. వారికి కావాల్సినంత 'స్టఫ్' అందించేశాడు. విశాఖ జిల్లాలో నారా లోకేష్ పర్యటన కోసం టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. అయితే, ఈ ఏర్పాట్లకు ఎడా పెడా షాక్‌లు తగిలాయి. బైక్ ర్యాలీ కోసం ప్రయత్నిస్తే, కొత్త ట్రాఫిక్ రూల్స్‌ని ప్రస్తావిస్తూ పోలీసులు ఇచ్చిన షాక్‌తో, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బాగా అప్‌సెట్ అయిపోయారు. అధినేత మెప్పుకోసం నారా లోకేష్ విశాఖ టూర్‌ని సక్సెస్ చేయాలనుకున్న అయ్యన్నపాత్రుడి అత్యుత్సాహానికి బ్రేకులు గట్టిగానే పడ్డాయి.
ఇదిలా వుంటే, నారా లోకేష్ మైక్ దొరకగానే వైసీపీ ప్రభుత్వం మీద విరుచుకుపడిపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ని 'తుగ్లక్'గా అభివర్ణించేశారు నారా లోకేష్. మూడు నెలల తుగ్లక్ పాలనని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారంటూ లోకేష్ చేసిన యాగీ అంతా ఇంతా కాదు. టీడీపీది అంత గొప్ప పాలన అయితే, ఇటీవలి ఎన్నికల్లో చిత్తుగా ఎందుకు ఓడిపోయిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
నారా లోకేష్ పేల్చిన ఒక్కో డైలాగ్‌నీ ప్రస్తావిస్తూ, నెటిజన్లు ఓ ఆట ఆడేసుకున్నారు. 'ఈసారి స్క్రిప్ట్ బాగానే ప్రిపేర్ అయి వచ్చినట్టున్నావ్..' అంటూ లోకేష్‌ని ఓ రేంజ్‌లో ఆడేసుకున్నారు సోషల్ మీడియాలో. నిజానికి, కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలే అయ్యింది. అప్పుడే ప్రభుత్వమ్మీద హద్దులు మీరిన విమర్శలు చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీనే అభాసు పాలైపోతోంది.
పాలనలో లోపాల్ని ఎత్తి చూపడం తప్పు కాదు.. విపక్షాల బాధ్యతే అది. కానీ, చీటికీ మాటికీ చెత్త కామెంట్స్ చేస్తూ తమ స్థాయిని మరింత దిగజార్చేసుకుంటే.. ఆటోమేటిక్‌గా జనంలో పలచనైపోవడం ఖాయం. పైగా, నారా లోకేష్‌కి సోషల్ మీడియాలో అభిమానులెక్కువ. ఆయన ఎప్పుడు ఏ కామెంట్ చేస్తారా.? ఆయన్ని ర్యాగింగ్ చేసేద్దామని చూస్తుంటారు ఆ అభిమానులు. మొన్నామధ్య ప్రకాశం బ్యారేజీలో ఓ పడవ వరదల కారణంగా కొట్టుకొచ్చి గేటుకి అడ్డం పడితే.. దాన్ని రాజకీయ కుట్రగా అభివర్ణించి లోకేష్ ఏ స్థాయిలో అభాసు పాలయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!