జగన్‌కు హోదా యోధుల జేజేలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనాథలాగా విడిపోయిన తర్వాత.. ప్రత్యేకహోదా ఉంటే తప్ప.. ఈ రాష్ట్రం సొంతకాళ్లపై నిలదొక్కుకోవడం అసాధ్యం అనే భావన రాష్ట్ర ప్రజలందరిలోనూ ఏర్పడింది. పదేళ్లపాటూ హోదా ఇస్తామన్న ప్రధాని మోడీ మాటలు బూటకాలే..…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనాథలాగా విడిపోయిన తర్వాత.. ప్రత్యేకహోదా ఉంటే తప్ప.. ఈ రాష్ట్రం సొంతకాళ్లపై నిలదొక్కుకోవడం అసాధ్యం అనే భావన రాష్ట్ర ప్రజలందరిలోనూ ఏర్పడింది. పదేళ్లపాటూ హోదా ఇస్తామన్న ప్రధాని మోడీ మాటలు బూటకాలే.. అని చాలా త్వరగానే రాష్ట్రం గ్రహించింది. అప్పటినుంచి.. ప్రత్యేకహోదాకోసం పలు విడతలుగా పోరాటాలు సాగుతూనే వచ్చాయి. అయితే.. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో కనీస సానుభూతి కూడా లేకుండా వ్యవహరించడం వలన ఈ పోరాటాలు ఎలాంటి ఫలితాన్ని సాధించలేకపోయాయి. అయితే.. పోరాడిన వారి మీద పోలీసు కేసులు మాత్రం మిగిలిపోయాయి.

హోదాకోసం ప్రజల్లో తొలినాళ్లలో వెల్లువెత్తుతున్న ఉద్యమస్ఫూర్తిని అడుగంటా తొక్కేసిన చంద్రబాబునాయుడు సర్కారు.. అప్పట్లో అనేకానేక కేసులు వారిమీద పెట్టించింది. హోదా పోరాటాల్ని ఉక్కుపాదాలతో అణిచేసింది. ప్యాకేజీకి జైకొట్టింది. మరోఏడాదిలో ప్రభుత్వ పదవీకాలం ముగిసిపోతుందనగా.. ఎన్డీయే నుంచి బయటకు వచ్చి… ప్రత్యేకహోదా కోసం తాము తపించిపోతున్నట్లుగా బిల్డప్ ఇవ్వడానికి దీక్షల పేరిట ప్రచార సభలు నిర్వహిస్తూ వందలకోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది.

హోదా స్ఫూర్తి తమలో ఉన్నదని చాటుకోవడానికి అంత తగలేసిన చంద్రబాబు సర్కారు.. కనీసం ఆ అయిదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా హోదాకోసం పోరాడినవారిపై పెట్టిన పోలీసుకేసులను ఎత్తివేయడం గురించి పట్టించుకోలేదు. మరో రకంగా చెప్పాలంటే.. ప్రత్యేకహోదా కోసం కేసులకు వెరవకుండా పోరాడిన వారిలో తటస్థులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు మాత్రమే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో… ఆ కేసులను ఎత్తివేయడం గురించి చంద్రసర్కారు పట్టించుకోకుండా డ్రామాలు ఆడింది.

జగన్ సారథ్యంలో బుధవారంనాడు జరిగిన కేబినెట్ భేటీ.. హోదా కోసం పోరాడిన వారిపై నమోదైన అన్నికేసులను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ కేసులపై కోర్టులో విచారణలో ఉన్న పిటిషన్లను కూడా ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. చంద్రబాబు హోదో స్ఫూర్తి అనే కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను బురిడీకొట్టించే ప్రయత్నం చేయగా, జగన్ సర్కారు కేసులు ఎత్తేసి వాస్తవంగా వారికి అండగా నిలబడింది.

జగన్ ఎప్పూడూ జాగ్రత్తగా ఉండాలి సుమా!