జగన్ సంక్షేమ సిరీస్‌లో ఇదికూడా…!

అవినీతిని కట్టడిచేయడం.. కాంట్రాక్టుల్లో దోపిడీకి తెరదించడం లాంటి ప్రయత్నాలమీదనే.. జగన్ తొలిరోజుల నిర్ణయాలు సాగిపోయాయి. ఆయా రంగాల్లో చాలా వరకు వ్యవహారాలను ఆయన కొలిక్కి తీసుకువచ్చారు. ఇక ఇప్పుడు పూర్తిగా సంక్షేమ పథకాల దిశగా…

అవినీతిని కట్టడిచేయడం.. కాంట్రాక్టుల్లో దోపిడీకి తెరదించడం లాంటి ప్రయత్నాలమీదనే.. జగన్ తొలిరోజుల నిర్ణయాలు సాగిపోయాయి. ఆయా రంగాల్లో చాలా వరకు వ్యవహారాలను ఆయన కొలిక్కి తీసుకువచ్చారు. ఇక ఇప్పుడు పూర్తిగా సంక్షేమ పథకాల దిశగా జగన్ దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. ఆ సిరీస్ నిర్ణయాలు ఇక ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో వైఎస్సార్ పెళ్లికానుక పథకానికి ఆమోదం లభించింది. శ్రీరామనవమి రోజునుంచి.. ఈ పథకాన్ని అమల్లోకి తెస్తారు.

అలాగే ఉద్దానం కిడ్నీ బాధితులకు సంబంధించి యాభై కోట్ల రూపాయలతో 200 బెడ్స్ హాస్పిటల్ తో పాటు, రీసెర్చి సెంటర్ ను కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం జీవో కూడా ఇచ్చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ కూడా కంటి పరీక్షలు చేయించేందుకు కూడా నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. వైఎస్సార్ కంటి వెలుగు పేరుతో నిర్వహించినున్న ఈ కార్యక్రమాన్ని అక్టోబరు 10 వతేదీనుంచి ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రజాసంక్షేమం దిశగా జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న వరుస నిర్ణయాలలో దీనిని తాజా నిర్ణయంగా భావించాలి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ కంటిపరీక్షలు నిర్వహించడం అంటే.. చాలా పెద్ద కసరత్తు అవసరం అవుతుంది. దీనివలన కోట్లమంది ప్రజలకు ఉపయోగం ఉంటుంది. నిజానికి ఇలాంటి కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడాదిలోనే నిర్వహించారు. ప్రజలనుంచి చాలా మంచి స్పందన లభించింది. ప్రజలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి.. అవసరమైన వారందరికీ కంటి అద్దాలు కూడా పంపిణీ చేశారు. శస్త్రచికిత్సలు అవసరమయ్యే వారిని కూడా విడిగా గుర్తించారు. దీనివలన ప్రజలకు మేలు జరిగినట్లుగా నిరూపణ అయింది.

తెలంగాణలో సక్సెస్‌ఫుల్‌గా నడిచిన ఈ పథకాన్ని యథాతథంగా జగన్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అనుసరిస్తున్నారు. దీనికి వైఎస్సార్ కంటివెలుగు అని పేరుపెట్టారు. దీని ద్వారా కోట్లమంది ప్రజలకు మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. భేషజాలకు, ఈగోలకు పోయి.. పొరుగు రాష్ట్రాల్లో ఉండే మంచి పథకాలను స్వీకరించడంలోనూ పాత సర్కారు విఫలమైంది. ఓటు బ్యాంకు పథకాలను మాత్రమే చంద్రబాబు అందిపుచ్చుకున్నారు. అయితే జగన్ కంటివెలుగు పథకాన్ని అనుసరించడంపై ప్రజల్లో సానుకూల స్పందన వస్తోంది.

జగన్ ఎప్పూడూ జాగ్రత్తగా ఉండాలి సుమా!