క‌రోనాపై వ్యాక్సినా…వ‌చ్చే ఏడాది వ‌ర‌కు ఆగాల్సిందే!

క‌రోనాపై వ్యాక్సిన్‌పై రెండు మూడు నెల‌ల్లో వ‌స్తున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేదు. వ్యాక్సిన్ కోసం వ‌చ్చే ఏడాది వ‌ర‌కు ఆగాల్సిందే. ఈ మాట‌లంటున్న‌ది మామూలు వ్య‌క్తులు కాదు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్…

క‌రోనాపై వ్యాక్సిన్‌పై రెండు మూడు నెల‌ల్లో వ‌స్తున్న ప్ర‌చారంలో వాస్త‌వం లేదు. వ్యాక్సిన్ కోసం వ‌చ్చే ఏడాది వ‌ర‌కు ఆగాల్సిందే. ఈ మాట‌లంటున్న‌ది మామూలు వ్య‌క్తులు కాదు. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథ‌న్ క‌రోనా వ్యాక్సిన్‌పై సూటిగా, స్ప‌ష్టంగా త‌న అభిప్రాయాలు చెప్పుకొచ్చారు.

ఆమె చెప్పే ప్ర‌కారం వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ పూర్తి కావ‌డానికి క‌నీసం ఆరు నుంచి తొమ్మిది నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. కొవాగ్జిన్‌, జైకోవ్‌-డీతో పాటు కరోనా చికిత్సకు ప్రయోగాలు జరుపుకుంటున్న ఏ వ్యాక్సిన్‌ కూడా 2021 కంటే ముందుగా అందుబాటులోకి వచ్చే అవకాశంలేదని ఆమె స్ప‌ష్టం చేశారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా 140 వ్యాక్సిన్‌లో ప్ర‌యోగ ద‌శ‌లో ఉన్నాయ‌ని, ఇందులో 11 వ్యాక్సిన్‌లు హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ ద‌శ‌కు చేరుకున్నాయ‌ని, వీటిలో ఏ ఒక్క‌టీ 2021 ముందుగా అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశ‌మే లేద‌ని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ పేర్కొంది.

వ్యాక్సిన్ క‌నిపెట్ట‌డానికి ఎందుకింత స‌మ‌యం అని ప్ర‌శ్నే వాళ్లు ఎక్కువే. అయితే ఇది కావాల‌ని జ‌రుగుతున్న జాప్యం ఎంత మాత్రం కాదు. ఎందుకంటే ఒక వ్యాక్సిన్‌ను పూర్తిస్థాయిలో మార్కెట్‌లో వ‌ద‌లాలంటే అనేక ద‌శ‌ల్లో ప‌రిశోధ‌న‌లు జ‌ర‌గాల్సి ఉంది. అవ‌న్నీ పూర్తి చేసుకుంటే త‌ప్ప మార్కెట్‌లోకి అనుమ‌తించ‌రు.

ఉదాహ‌ర‌ణ‌కు క‌రోనా వైరస్‌ను తీసుకుందాం. దాన్ని నిర్మూలించేందుకు వ్యాక్సిన్‌ను మూడు ద‌శ‌ల్లో ట్ర‌య‌ల్స్ జ‌ర‌పాల్సి ఉంటుంది.   తొలి రెండు దశల్లో వ్యాక్సిన్ మ‌నిషికి ఎంత మాత్రం సురక్షితం? వ్యాక్సిన్  వ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అనే అంశాల ప్రాతిప‌దిక‌న ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతారు. మూడో దశలో వ్యాక్సిన్ ఏ మాత్రం ప‌ని చేస్తుంది?  దాని సమర్థత ఎంత అనే అంశంపై పరీక్షలు నిర్వహిస్తారు.

ఈ మూడు ద‌శ‌ల్లో స‌మ‌గ్ర ఫ‌లితాలు రావ‌డానికి చాలా స‌మ‌యం తీసుకుంటుంది. ఒక్కోసారి ఒక్కో దశ పూర్తికావడానికి నెలల నుంచి సంవత్సరాల సమయం పడుతుంద‌ని సైంటిస్ట్‌లు చెబుతున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్‌', జైడూస్‌ కాడిలా సంస్థ అభివృద్ధి చేసిన ‘జైకోవ్‌-డీ’ వ్యాక్సిన్‌లకు తొలి రెండు దశల ట్రయల్స్‌ నిర్వహించడానికి ఈ వారంలోనే అనుమతులు లభించాయి. దీన్నిబట్టి చూస్తే ఆయా వ్యాక్సిన్‌లు పూర్తిస్థాయిలో పరీక్షలు జరుపుకోవాలంటే కొన్ని నెలల సమయం పట్టొచ్చు.  

కాగా అనుకున్న‌వి అనుకున్న‌ట్టే జ‌రిగితేనే ఆరు నెల‌ల నుంచి తొమ్మిది నెల‌ల‌లోపు క‌రోనాకు వ్యాక్సిన్ వ‌చ్చే అవ‌కాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు. లేదంటే మ‌రింత ఆల‌స్యం అయ్యే అవ‌కాశం ఉంద‌ని ఆమె ప‌రోక్షంగా చెప్పుకొచ్చారు. అందువ‌ల్ల క‌రోనా నుంచి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకోవాలంటే స్వీయ ర‌క్ష‌ణ చ‌ర్య‌లు త‌ప్ప మ‌రో మార్గం లేదన్న మాట‌. 

ఇడ్లీపాత్ర లాగా ఉప్మాగిన్ని లాగా డిజైన్లు చేశారు