నిన్నమొన్నటి వరకు టిక్‌టాక్‌లో అలరిస్తూ, వినోదం పంచుతూ సెలబ్రిటీ స్టేటస్‌ను ఎంజాయ్ చేసేవాళ్లు. ప్రచారంతో పాటు రెండు చేతులా సంపాదిస్తున్న టిక్‌టాక్ స్టార్లపై …ఆ యాప్ నిషేధం పిడుగుపాటైంది. జీవనం పోయి, జీవితం అంధకారమైంది. తమకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన టిక్‌టాక్ యాప్ ఇక ఎప్పటికీ కనిపించదనే చేదు వార్త…వారిని డిప్రెషన్లోకి నెట్టింది. తమ సృజనకు కళను రంగరించి లక్షలాది మంది ఫాలోయెర్స్‌ను సంపాదించుకున్న టిక్‌టాక్ స్టార్స్….ఆ యాప్ నిషేధంతో తాము దిక్కులేని వారమయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టిక్‌టాక్ స్టార్స్ ని కదిలిస్తే కన్నీళ్ల వేదన ఉబికి వస్తోంది. వైజాగ్ టిక్‌టాక్ స్టార్ భార్గవ్‌కు 85 లక్షల మంది ఫాలోయెర్స్ ఉండేవాళ్లు. ఇప్పుడు అతనిది ఏకాకి జీవితం. క్రియేటివ్ ఆర్టిస్ట్‌లకి వేరే పనిచేయడం చేతకాదని, అలాంటిది ఇప్పుడు యాప్ నిషేధంతో ఏం చేయాలో దిక్కుతోచక డిప్రెషన్‌కు లోనయ్యానని అతన మనస్తాపం చెందాడు.
‘హఠాత్తుగా టిక్‌టాక్‌ను బ్యాన్ చేశారనే వార్త వినేసరికి నేను డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. టిక్‌టాక్ ద్వారానే రెండేళ్లుగా నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఒక టీమ్ కూడా ఉంది. ఇప్పుడు నేను ఏం చేసి డబ్బు సంపాదించుకోవాలో అర్థం కాలేదు. సరదాగా మాట్లాడటం, సమాజంలోని సమస్యల మీద స్పందించటం నాకు దేవుడు ఇచ్చిన వరం. ఆ వరంతోనే ఈ స్థితికి ఎదిగాను. చాలామంది టిక్‌టాక్ అంటే ఫన్నీగా చేసుకునే యాప్ అనుకుంటారు. కాని నేను చాలా సామాజిక సమస్యల మీద వీడియోలు చేశాను. అది నా బాధ్యతగా భావించాను ’ అని భార్గవ్ ఆవేదనతో చెప్పుకొచ్చాడు.
టిక్‌టాక్ స్టార్ ‘ఓ మైగాడ్ నిత్య’ ఇప్పుడిప్పుడే ధైర్యాన్ని కూడగట్టుకుంటోంది. తనలాంటి వాళ్లు టిక్ టాక్ ద్వారా సెలబ్రిటీ స్థాయికి ఎదిగామంది. ఇప్పుడు ఆ యాప్ మూతపడడంతో బాధ అనిపించినా…దిగులుతో కూచోకుండా కొత్త మార్గాల వైపు అన్వేషించాల్సిన అవసరాన్ని తెలిసొచ్చిందన్నారు. స్వదేశీ యాప్‌లతో సరికొత్తగా మనల్ని మనం ఆవిష్కరించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
అలాగే తిరుపతి, విజయవాడ, కడప, నెల్లూరు తదితర ప్రాంతాల్లోని లోకల్ టిక్‌టాక్ స్టార్లు కూడా ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటున్నారు. స్వదేశీయాప్లపై దృష్టి సారించారు. స్వదేశీ యాప్‌లు ఏవేవో వచ్చాయో, వస్తున్నాయో ఆరా తీస్తున్నారు. టిక్‌టాక్ యాప్ లాంటి ఆదాయం తీసుకొచ్చే యాప్‌లపై ఆసక్తి కనబరుస్తున్నారు. టాలెంట్ ఉంటే తప్పక మరోసారి నెటిజన్ల ఆదరణ పొందుతామని ఆశాభావంతో ముందడుగు వేస్తుండడం సంతోషించాల్సిన విషయం.