పోరాటాల్లో రాటుదేలాల్సిన రాజకీయ నాయకుడు…అందుకు విరుద్ధంగా నటనలో రోజురోజుకూ రాటుదేలుతున్నాడు. ఆ రాజకీయ నేతను ఉత్తమ నటుడిగా తీర్చిదిద్దుతున్న ఘనత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికే దక్కుతుంది. కమ్యూనిస్టు నేతగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టి…ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి హోదాలో నాయకత్వం వహిస్తూ, పెట్టుబడిదారీ ఆలోచనలతో, వాళ్ల స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్న నాయకుడి గురించి చెప్పమంటే…రామకృష్ణ అని ఎవరైనా ఠకీమని జవాబిస్తారు.
ప్రతి పొలిటికల్ యాక్టివిటీ వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో…వాటికి మీడియా ఇచ్చే ప్రాధాన్యాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు సాక్షిలో ఓ వార్తకు ప్రాధాన్యం ఇచ్చారంటే అది జగన్‌కు లాభం కలిగించేదై ఉంటుంది. అదే ఒక వార్త ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ప్రాధాన్యం ఇచ్చారంటే చంద్రబాబుకు ప్రయోజనం కలిగించడానికే అని అర్థం చేసుకోవచ్చు.
ఈ రోజు (సోమవారం) ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో మొదటి పేజీల్లో ఓ సమావేశం గురించి ఇండికేషన్ ఇచ్చిన వార్త గురించి మాట్లాడుకుందాం. ఈనాడులో ‘సభాపతి వ్యాఖ్యలు హూందాగా లేవు’ అనే శీర్షిక, దాని ఉప శీర్షిక ‘ఆయన లేవనెత్తిన ప్రతిపాదనలపై చర్చకు సిద్ధంః సీపీఐ రామకృష్ణ’, అలాగే ఆంధ్రజ్యోతిలో ‘ఇది న్యాయ వ్యవస్థపై దాడి’ శీర్షిక, దాని ఉప శీర్షిక ‘న్యాయవాదుల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు’ అని గమనించవచ్చు.
తిరుపతి, తిరుమల పర్యటనలో భాగంగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం న్యాయస్థాన తీర్పులపై కొన్ని కీలక వ్యాఖ్యానాలు చేశారు. ప్రజాతీర్పే అంతిమమని ఆయన స్పష్టం చేశారు. కోర్టుల తీర్పుపై చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగమేఘాలపై ముందుకొచ్చాడు. చంద్రబాబు ప్రయోజనాల కోసం ఎంత నిబద్ధతతో పని చేస్తున్నాడో తెలియజేసే ఈ సమావేశం గురించి చర్చిద్దాం.
విజయవాడలో భారత న్యాయవాదుల సంఘం (ఐఏఎల్) ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో ‘న్యాయ వ్యవస్థపై ఏపీ స్పీకర్, రాజకీయ నాయకుల దాడి’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏం మాట్లాడారనే అంశం కంటే నిర్వాహకులు, పాల్గొన్న వారెవరో తెలుసుకోవడంతో పాటు ఆ వార్తకు ఎల్లో మీడియా ఇచ్చిన ప్రాధాన్యం బట్టి ఎవరి ప్రయోజనాల కోసమో అర్థం చేసుకోవడం సులువవుతుంది.
సమావేశాన్ని నిర్వహించిన ఐఏఎల్ జాతీయ కార్యదర్శి చలసాని అజయ్‌కుమార్‌కు సీపీఐతో సంబంధ బాంధవ్యాలున్నాయి. అలాగే ఏపీ రైతు సంఘం, ఇన్సాఫ్, ఏపీ ప్రజా నాట్య మండలి సంస్థలన్నీ సీపీఐ అనుబంధ విభాగాలు. ఇక ఈ సమావేశంలో మాట్లాడిన వక్తల్లో రాజ్యసభ సభ్యుడు రవీంద్రకుమార్ టీడీపీ నాయకుడితో పాటు జనసేన నేత ముత్తంశెట్టి ప్రసాద్‌బాబు ఉన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రధాన వక్త కావడం గమనార్హం. అంటే చంద్రబాబు సేవలో తానొక్కడినే సరిపోనని పార్టీ అనుబంధ సంస్థలను కూడా రామకృష్ణ తీసుకొచ్చారని ఈ సభ ద్వారా తెలిసొచ్చింది.
ఈ సమావేశంలో సీపీఎం నుంచి ఏ ఒక్కరూ పాల్గొనకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం సీపీఐతో పాటు ఆ పార్టీ అనుబంధ ప్రజాసంఘాలను తాకట్టు పెట్టేందుకు రామకృష్ణ వెనుకాడలేదని సీపీఎం గ్రహించడం వల్లే…ఈ సమావేశానికి ఆ పార్టీ దూరంగా ఉంది. సీపీఐ అనే తటస్థ రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా సమావేశాలు నిర్వహిస్తూ అప్రతిష్టపాలు చేయాలనే ఎత్తుగడ చంద్రబాబు వేస్తే…దాన్ని విజయవంతంగా అమలు చేసే బాధ్యతను రామకృష్ణ భుజానకెత్తుకుని అద్భుతంగా నటిస్తున్నాడనే విమర్శలున్నాయి.
సినిమాలు వచ్చిన తర్వాత నాటక రంగం అంతరించిపోయిందని రంగస్థల కళాకారులు ఆవేదన చెందుతున్న దశలో రామకృష్ణ తన నటనా చాతుర్యంతో…తిరిగి ఆ రంగానికి ప్రాణం పోయడం ప్రశంసనీయం. ఎరుపు చొక్కా మార్చి పసుపు చొక్కా వేస్తే పోయేదేం లేదు…ముసుగు తప్ప. ఈ విషయం రామకృష్ణ గ్రహిస్తే సీపీఐకి ఎంతో మేలు చేసిన వ్యక్తి అవుతాడు.