కేసీఆర్ ని కానీ, టీఆర్ఎస్ పార్టీని కీనీ పల్లెత్తు మాట అనడానికి మెయిన్ స్ట్రీమ్ మీడియా జంకుతున్నవేళ.. సోషల్ మీడియా ఆ బాధ్యత భుజానికెత్తుకుంది. వేర్ఈజ్ కేసీఆర్ పేరుతో ఓ హ్యాష్ ట్యాగ్ హల్ చల్ చేస్తోంది. తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న వేళ, కేసీఆర్ కనిపించడం లేదని, ఆయన ఫామ్ హౌజ్ కే పరిమితమైపోయారని విమర్శలొస్తున్నాయి.
కేటీఆర్ సహా.. మిగతా నేతలెవరూ కరోనాపై స్పందించకపోవడంతో సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. కరోనా కష్టకాలంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విషయం స్పష్టమవుతున్న వేళ, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కరోనా బారిన పడి హోమ్ క్వారంటైన్ కి పరిమితమవుతున్న వేళ.. నెటిజన్లు టీఆర్ఎస్ సర్కార్ ని ఓ ఆట ఆడేసుకుంటున్నారు.
కరోనా భయానికి తోడు, లాక్ డౌన్ భయంతో హైదరాబాద్, సికింద్రాబాద్ ఖాళీ అవుతున్నాయి. ఎక్కడికక్కడ వలస జీవులు సొంతూళ్ల బాట పడుతున్నారు. ఇప్పటివరకు అటుఇటుగా 20 లక్షల మంది గ్రేటర్ హైదరాబాద్ ను వదిలి వెళ్లారనేది అనధికారిక సమాచారం. దీంతో భాగ్యనగరానికి టు-లెట్ బోర్డ్ పడింది. దీన్ని కూడా సీరియస్ గా తీసుకోవడంలేదు శ్రీనివాసగౌడ్ లాంటి మంత్రులు. రైతు బంధు డబ్బులు పడుతున్నాయని, పొలం పనులు బాగున్నాయని, అందరూ పల్లెలకు వెళ్తున్నారట. పల్లెల్లో అయితే సామాజిక దూరం పాటించొచ్చని, వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందని, అందుకే ప్రజలంతా పల్లెబాట పడుతున్నారని ఆయన తనదైన శైలిలో ఓ వెరైటీ వివరణ ఇచ్చుకున్నారు.
ఇలాంటి లాజిక్ లేని మాటల వల్లే సగం పరువు పోయింది. కేటీఆర్ ఇచ్చిన మాస్క్ పెట్టుకోకుండా ఓవర్ యాక్షన్ చేసిన పద్మారావు గౌడ్ కరోనాబారిన పడ్డారు. ఇలాంటి వీడియోలకి కూడా కొదవ లేదు. మొత్తమ్మీద.. టీఆర్ఎస్ నాయకుల అలసత్వం, నిర్లక్ష్యంతో తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. అదే సమయంలో కేసీఆర్, కరోనాను కాదని ఇతర పథకాలు, కార్యక్రమాల మీద దృష్టిపెట్టారు.
తమకు కరోనా వచ్చిందనే వార్తల్ని చాలామంది రాజకీయ నాయకులు ఖండిస్తున్నారు, ఇంకొందరు అంగీకరిస్తూ సెల్ఫీ వీడియోలు విడుదల చేస్తూ.. ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ కానీ ఈ రెండు చేయలేదు. అందుకే “వేర్ ఈజ్ కేసీఆర్” అంటున్నారు తెలంగాణ జనాలు.