పార్క్ హయత్.. ఈ పేరు చెబితే ఎన్నో వివాదాలు, మరెన్నో తెరచాటు సంగతులు తెరపైకొస్తాయి. సినీప్రముఖులతో పాటు రాజకీయ నాయకులకు చెందిన ఎన్నో వివాదాలకు పార్క్ హయత్ కు లింక్ ఉంది. తాజాగా మరోసారి ఈ స్టార్ హోటల్ వార్తల్లోకెక్కింది. ఈసారి పార్క్ హయత్ లో ఏకంగా రేవ్ పార్టీ జరగడం కలకలం రేపింది.
కరోనాతో పబ్బులన్నీ మూతపడ్డాయి. పార్టీలన్నీ అటకెక్కాయి. మరి అలాంటి పబ్బులు, పార్టీలకు అలవాటుపడిన బడా బాబుల సంగతేంటి. సరిగ్గా ఇక్కడే తెరపైకొచ్చింది పార్క్ హయత్. ఈ హోటల్ లో ఏకంగా రేవ్ పార్టీ నిర్వహించారు. బడా బాబులంతా ఒక చోట చేరారు. లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా పార్టీ చేసుకున్నారు.
పక్కా సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు అన్ని వైపుల నుంచి పార్క్ హయత్ ను ముట్టడించారు. తలుపులు తెరిచి చూస్తే అంతా మద్యం మత్తులో జోగుతూ, పార్టీ చేసుకుంటూ కనిపించారు. నిబంధనలకు విరుద్ధంగా పార్టీ చేసుకుంటున్న వ్యక్తుల్లో కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎపిడమిక్ డీసెజస్ యాక్ట్ కింద కేసులు నమోదుచేశారు.
ఈ కేసులో చాలా ట్విస్టులు ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ రైడ్స్ లో ఓ మంత్రి అల్లుడు అడ్డంగా దొరికిపోయాడనేది తాజా సమాచారం. ఆ మంత్రి ఎవరు, ఆ అల్లుడు పేరు ఏంటనేది పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. దీంతో పాటు ఈ పార్టీ నిర్వహించిన వ్యక్తికి చాలా పెద్ద చరిత్ర ఉంది. అతడి పేరు సంతోష్ రెడ్డి. గతంలో నిబంధనలకు విరుద్ధంగా ఎన్నో రేవ్ పార్టీలు నిర్వహించి పోలీసులకు దొరికిపోయిన ఘనుడు ఇతడు.
ఇక ఈ కేసులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఏకంగా నలుగురు అమ్మాయిల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్లలో ఉక్రెయిన్ కు చెందిన ఓ విదేశీ మహిళ కూడా ఉంది.
ఇలా కరోనా టైమ్ లో జరిగిన ఈ రేవ్ పార్టీ లో చాలా ముడులు ఉన్నాయి. ఈ పార్టీ వెనక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.