వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. కరోనా -లాక్ డౌన్ నేపథ్యంలో చాన్నాళ్లుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పనిసరిగా సొంత జిల్లాకు కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో జగన్ కడప-పులివెందుల పర్యటనకు వెళ్తున్నారు.
జగన్ తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి ఇడుపాలపాయకు వెళ్లడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల ఏడు, ఎనిమిదో తేదీల్లో జగన్ వైఎస్ఆర్ కడప జిల్లా పర్యటన ఉంటుందని తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఒక కీలకమైన చేరిక కూడా ఉంటుందని సమాచారం. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన సతీష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టుగా తెలుస్తోంది. కొన్ని నెలల కిందట సతీష్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి పులివెందుల నియోజకవర్గంలో మొదటి నుంచి అండగా ఉంటూ వచ్చిన సతీష్ రెడ్డి, చంద్రబాబు తీరుపై విసుగెత్తి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు.
లాక్ డౌన్ వంటి పరిణామాలు లేకపోయి ఉంటే.. ఈ పాటికే సతీష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేవారు. దీంతో ఈ చేరిక లేటయ్యిందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో, ఆయన ఆధ్వర్యంలోనే సతీష్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. పులివెందుల నియోజకవర్గానికి జగన్ రాకకోసమే సతీష్ రెడ్డి చేరిక ఇన్నాళ్లూ ఆగిందని సమాచారం.