ఏపీ బీజేపీకి ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అవుతున్నట్టు కనిపిస్తోంది. మిత్రపక్షం అంటూనే జనసేనాని వెన్నుపోటు పొడుస్తున్నాడని ఆ పార్టీ నేతలు ఆలస్యంగా గ్రహించారు. ఇప్పటం గ్రామంలో కమ్యూనిస్టు నాయకులు పవన్ పక్కన వుండడంతో ఇంతకాలంగా బీజేపీలో ఉన్న అనుమానాలకు సమాధానం దొరికినట్టైంది. ఈ నేపథ్యంలో పవన్‌కల్యాణ్‌పై ఏపీ బీజేపీ వ్యూహాత్మక మౌనం పాటించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో ఈ నెల 11న విశాఖలో ప్రధాని మోదీ పర్యటనకు జనసేనను ఆహ్వానించే విషయమై ఏపీ బీజేపీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలకాలని పార్టీ శ్రేణులకు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పిలుపునిచ్చారు. విశాఖలో రెండు రోజులుగా సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావు మకాం వేశారు. ప్రధాని పర్యటనపై తామేదో ఉద్ధరిస్తున్నట్టు బీజేపీ నేతలు బిల్డప్ ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
ప్రధాని పర్యటనకు సంబంధించి వివరాలు వెల్లడించేందుకు జీవీఎల్, సోము వీర్రాజు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని సభకు మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ఆహ్వానిస్తారా? అని మీడియా ప్రతినిధులు సోము వీర్రాజును ప్రశ్నించారు. దీనికి వీర్రాజు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
పవన్‌కల్యాణ్ వైఖరిపై అసంతృప్తి, అసహనంగా ఉన్న బీజేపీ నేతలు, ఆయనతో దూరంగా ఉండడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే పవన్ తనకు తానుగా పొత్తు లేదని ప్రకటించాలని బీజేపీ కోరుకుంటోంది. అది కూడా త్వరలో జరిగే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.